30, జులై 2020, గురువారం

మీరు దేనికి పనికి రారు అనుకోవడం అబద్ధం. మీరు విలువైనవారు కాదని అనుకోవడం అబద్ధం.

నిక్ ఉజిసిక్



శరీరం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఈ శరీరంలోని ప్రతి అవయవం మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాని వాటిని మనం మన అల్పమైన సంతోషాల కోసం పాడు చేసుకుంటున్నాము. కొంతమంది సిగరెట్స్ , మందు, గుట్కా, మత్తుమందులకు బానిసలై వారి అవయవాలను పాడు చేసుకుంటున్నారు. అటువంటి ఈ ప్రపంచంలో పుట్టుకతోనే కాళ్ళు, చేతులు లేకుండా జన్మించి ఎన్నో అవమానాలు, హేళనలు, ఇసడింపులు ఎదుర్కొని చనిపోవాలని అనుకుని కూడా బ్రతికి ఈ రోజు ప్రపంచానికి ఒక ఆదర్శవంతునిగా నిలిచిన వ్యక్తి నిక్ ఉజిసిక్

నిక్ ఉజిసిక్ 1982లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో జన్మించాడు. పుట్టుకతోనే కాళ్ళు, చేతులు లేకుండా పుట్టిన నిక్ ని చుసిన వాళ్ళ అమ్మ అతనిని తన దగ్గరకు తీసుకోదు. కాని ప్రార్ధనాలయంలోని పెద్దలు, అందరూ దేవుడి ప్రతి రూపాలే అని ఆమెకు వివరించి చెప్పగా అప్పటినుండి నిక్ ని తన బిడ్డగా స్వీకరిస్తుంది. అలా నిక్ తల్లిదండ్రులు నిక్ ని ఒక అవిటివాడిగా కాకుండా మాములు పిల్లాడిలాగా పెంచుతారు. నిక్ ని ఎటువంటి స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయరు. తనని అందరూ చదివే స్కూల్లోనే జాయిన్ చేస్తారు. కానీ మొదట్లో నిక్ కి అక్కడి పిల్లలతో కలిసి చదవడం రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మానాన్న ప్రోత్సాహంతో కష్టపడి వాళ్ళతో పాటు పోటీపడి చదువుతాడు.


కాని నిక్ స్నేహితులు మాత్రమ్ తనని ప్రతి సారి కుంటివాడా కుంటివాడా అని ఏడిపించేవారు. 
ఆ అవమానాన్ని తట్టుకోలేక రెండు మూడు సార్లు చనిపోవడానికి ప్రయత్నిస్తాడు, కాని బ్రతుకుతాడు, వాళ్ళ అమ్మతో చనిపోతాను అని చెప్తాడు, అప్పుడు నిక్ వాళ్ళ అమ్మ ఎంతో గుండె ధైర్యాన్ని నమ్మకాన్ని తనలో నింపుతుంది. అలా తనలో భయాన్ని పోగొట్టి పరిస్థితులను ధైర్యంగా ఎదురుకునే తత్వాన్ని తనలో కలిగిస్తుంది. అలా ఎవరైనా తనని హేళన చేస్తే వాళ్లకు  ధైర్యంగా సమాధానం చెప్తాడు. నిక్ ఎప్పుడు ఒకటే అనుకునేవాడు. ఓటమిని ఆంగీకరించకూడదు. ఏదైనా కష్టపడి సాధించుకోవాలి అని అనుకునేవాడు. అలా కష్టమైనా స్విమ్మింగ్, సర్ఫింగ్ ఇంకెన్నో నేర్చుకుంటాడు.




నిక్ తన ప్రసంగాలతో ఎంతో మంది యువతను, శరీరలోపాలతో పుట్టిన వారిని ఉత్తేజితులని చేసాడు. ఇతడు ఇతడి కాళ్ళను కోడి కాళ్ళతో పోలుస్తాడు. అలా ఇతని ప్రసంగాలు ఎంతో మంది జీవితాల్లో మార్పును తెచ్చాయి. అలా ఇతను కనై మియాహార అనే అమ్మాయిని 2012లో పెళ్లి చేసుకుంటాడు. ఇతనికి నలుగురు పిల్లలు పుట్టారు.

 

 

    ఇతను రాసిన ప్రముఖ పుస్తకాలు. 

లవ్ విత్ అవుట్ లిమిట్స్. 

లైఫ్ విత్ అవుట్ లిమిట్స్. 

లిమిట్ లెస్. 

అన్ స్టోప్బుల్ 

స్టాండ్ స్ట్రాంగ్ 

26, జులై 2020, ఆదివారం

మీరు పేదగా జన్మించినట్లయితే అది మీ తప్పు కాదు, కానీ మీరు పేదగా చనిపోతే అది మీ తప్పు.

బిల్ గేట్స్


BILL GATES అసలు పేరు విలియం హెన్రీ గేట్స్ III. ఇతను అక్టోబర్ 28, 1955లో జన్మించాడు. ఇతను ఒక అమెరికన్ బిజినెస్ మాగ్నెట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇన్వెస్టర్ మరియు పరోపకారి. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యొక్క సహ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ది చెందాడు. 

బిల్ గేట్స్ చాలా బాగా చదివేవాడు. అమెరికాలోని కళాశాలలలో అడ్మిషన్ కోసం పెట్టే SCHOLASTIC APTITUDE TESTS (SAT) పరీక్షలో 1600 మార్కులకు గాను 1590 మార్కులు సాధిస్తాడు. అలా HARVARD UNIVERSITY లో జాయిన్ అవుతాడు. అయితే మొదటి నుండి బిల్ కి కోడింగ్, ప్రోగ్రామింగ్ అంటే ఎంతో మక్కువ. ఆ మక్కువతో సమ్మర్ హాలిడేస్ లో HONEYWELL లో పని చేసేవాడు. అయితే బిల్ గేట్స్ చదువుకునే సమయంలో సాఫ్ట్ వేర్ రంగం అద్భుతంగా ముందుకు సాగుతున్నందువల్ల, బిల్ గేట్స్ ఇదే మంచి అవకాశం అని కొత్త సాఫ్ట్ వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. అందుకోసం తన చదువు మధ్యలో మానేయాల్సి వస్తుంది. అయినా గాని బిల్ గేట్స్ వెనక్కి తగ్గడు. ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు. తనలో ఆసక్తి చుసిన వాళ్ళు కూడా బిల్ గేట్స్ ను ప్రోత్సహిస్తారు. అలా చదువు మధ్యలోనే మానేసి తన స్నేహితుడు PAUL ALLEN తో కలిసి కొత్త సాఫ్ట్ వేర్ కంపెనీని మొదలు పెడతాడు.

అలా 1975లో తన స్నేహితుడితో కలిసి MICRO-SOFT కంపెనీని స్థాపిస్తాడు. 

   

ED ROBERTS మరియు TRAF O DATA వీరిద్దరూ MITS కంపెనీ ఫౌండర్స్ . ఈ MITS కంపెనీ కొత్త ALTAIR  8800 మైక్రోకంప్యూటర్ కు సాఫ్ట్ వేర్ కావాలని ప్రకటన ఇస్తుంది. అయితే బిల్ గేట్స్ తను సాఫ్ట్ వేర్ తయారు చేసానని MITS కంపెనీకి లెటర్ పంపుతాడు. అయితే నిజానికి బిల్ గేట్స్ ఆ సాఫ్ట్ వేర్ అప్పటికి ఇంకా తయారు చేయడు. అయితే MITS కంపెనీ బిల్ గేట్స్ ను సాఫ్ట్ వేర్ గురించి మాట్లాడడానికి పిలుస్తుంది. అలా MITS కంపెనీవాళ్ళు పిలిచిన కొన్ని వారాలకు బిల్ గేట్స్ ఆ సాఫ్ట్ వేర్ యొక్క పూర్తి ప్రణాళికను తయారు చేసి వాళ్ళకి ఇస్తాడు. ఆ సాఫ్ట్ వేర్ నచ్చడంతో మైక్రోసాఫ్ట్ కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకుంటుంది. ఇది బిల్ గేట్స్ మొదటి సక్సెస్.  

అలా అతి తక్కువ సమయంలో బిల్ గేట్స్ చాలా సక్సెస్ అవుతాడు. అలా పేరొందిన IBM కంపెనీకి కూడా సాఫ్ట్ వేర్ తయారు చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. 

బిల్ గేట్స్ ప్రస్తుత భార్య అయిన మిలెంద అన్నే ఫ్రెంచ్ డల్లాస్ లో పుట్టి పెరిగింది. తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన కొన్ని రోజులకే మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరుతుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంతో అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. అలా చేరిన కొన్ని సంవత్సరాలకే జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపడుతుంది. మిలెంద యొక్క పని తీరు చూసి బిల్ గేట్స్ ఆమెను చాలా ఇష్టపడతాడు. అలా బిల్ గేట్స్ మిలెందను 1994లో వివాహం చేసుకుంటాడు.

బిల్ గేట్స్  గడిచిన 23 ఏళ్లలో 18 సార్లు ది వరల్డ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 

2004లో బిల్ గేట్స్ దీర్ఘ కాల స్నేహితుడైన వారెన్ బఫెట్ నేతృత్వంలోని పెట్టుబడి సంస్థ  BERKSHIRE HATHAWAY డైరెక్టర్ అయ్యాడు.

మైక్రో సాఫ్ట్ కంపెనీ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు మరియు ఎంతో గొప్ప పేరు సంపాదించిన బిల్ గేట్స్ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యల పరిష్కారం కోసం పాటు పడుతున్నాడు. అంతేకాకుండా చిన్న పిల్లల ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
 
సాధారణంగా చిన్న పిల్లలలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని వల్ల 1990లో 5సంవత్సరాలలోపు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 9 శాతం మరణించేవారు. అది 2020 కు 4 శాతంగా మారింది. దీనికి కారణం వ్యాక్సిన్. మాములుగా ఏదైనా బాక్టీరియా శరీరంలోకి వెళ్లిన వెంటనే దాన్ని నిరోధించడానికి తెల్ల రక్త కణాలు యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి. అవి బాక్టీరియా తో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
 
కానీ 5 సంవత్సరాలలోపు పిల్లలలో ఆ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దాని వల్ల బాక్టీరియా శరీరంలోకి వెళ్లిన వెంటనే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం వ్యాక్సిన్ ని చిన్న పిల్లల శరీరంలోకి ప్రవేశపెట్టడం వల్ల తెల్ల రక్తకణాలు యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేసి బాక్టీరియాని సమర్ధవంతంగా నాశనం చేస్తాయి. ఈ వ్యాక్సిన్ ని GAVI అనే వ్యాక్సిన్ కంపెనీ తయారు చేసింది. BILL GATES ఈ GAVI కంపెనీతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ని 
BILL AND MILENDA GATES FOUNDATION ద్వారా అందిస్తున్నారు. అలా BILL GATES ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు.

BILL AND MILENDA GATES FOUNDATION



BILL AND MILENDA GATES FOUNDATION నాలుగు విభాగాలుగా నిర్వహించబడుతుంది.

గ్లోబల్ డెవలప్మెంట్ డివిజన్ :ఈ గ్లోబల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. ఆగష్టు 25, 2018 న, గేట్స్ తన ఫౌండేషన్ మరియు యునిసెఫ్ ద్వారా 600,000 డాలర్లను పంపిణీ చేసాడు, ఈ డబ్బును భారతదేశంలోని కేరళలో వరద బాధితుల సహాయం కోసం ఉపయోగించారు.

గ్లోబల్ హెల్త్ డివిజన్ : ఈ గ్లోబల్ హెల్త్ డివిజన్ యొక్క లక్ష్యం పేద దేశాలలో ఉన్న 120 మిలియన్ల మంది మహిళలు మరియు బాలికలకు, అధిక-నాణ్యత గర్భనిరోధక సమాచారం మరియు సేవలను అందించడం. విటమిన్ ఎ లోపాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగించే జన్యుపరంగా మార్పు చెందిన బియ్యం అయిన గోల్డెన్ రైస్‌ను అభివృద్ధి చేయడంలో ఫౌండేషన్ అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు మద్దతు ఇస్తోంది.

యునైటెడ్ స్టేట్స్ డివిజన్ : అమెరికాలోని విద్యావ్యవస్థ అభివృద్ధికి యువతకు మెరుగైన అవకాశాల కల్పనకు ఈ డివిజన్ పనిచేస్తుంది.  2005 నుండి, గేట్స్ మరియు అతని ఫౌండేషన్ ప్రపంచ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపాయి. ఉదాహరణకు, వారు "రీఇన్వెంట్ ది టాయిలెట్ ఛాలెంజ్" ను ప్రకటించారు,  పారిశుధ్యం మరియు సాధ్యమైన పరిష్కారాల గురించి అవగాహన పెంచడానికి, గేట్స్ 2014 లో "మానవ మలం నుండి ఉత్పత్తి చేయబడిన" నీటిని తాగాడు - వాస్తవానికి ఇది ఓమ్ని ప్రాసెసర్ అని పిలువబడే మురుగునీటి బురద శుద్ధి ప్రక్రియ నుండి ఉత్పత్తి చేయబడింది. అంతే కాకుండా అమెరికాలో ఎన్నో సేవాకార్యక్రమాలలో గేట్స్ చురుగ్గా పాల్గొంటాడు. 

గ్లోబల్ పాలసీ & అడ్వకేసీ డివిజన్ : ఈ గ్లోబల్ పాలసీ & అడ్వకేసీ నాయకత్వ బృందం ఫౌండేషన్ యొక్క విజయానికి కీలకమైన ప్రభుత్వాలు, ప్రైవేట్ పరోపకారి, మీడియా సంస్థలు, పబ్లిక్ పాలసీ నిపుణులు మరియు ఇతర ముఖ్య భాగస్వాములతో వ్యూహాత్మక సంబంధాలను ఏర్పరచుకునే  విధానాల యొక్క పని తీరును పర్యవేక్షిస్తుంది.ఈ డివిజన్ కి ప్రెసిడెంట్ గా భారతదేశానికి చెందిన GARGEE GHOSH అనే ఆమె పని చేస్తున్నారు.  

24, జులై 2020, శుక్రవారం

ఈర్ష ఎప్పుడూ సత్యాన్ని అంగీకరించదు.


గౌతమ బుద్ధ



ఈ జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటం మనం మాత్రమే బాగుండాలనే స్వార్ధంతో,ధర్మాన్ని తప్పయినా సరే గొప్పవాడిని అని అనిపించుకోవాలనే కోరికతో చేయడం అనేది జీవితం కాదు, ధర్మం కోసం, జనం కోసం బ్రతకడమే జీవితమని మానవాళికి శాంతి మార్గాన్ని చూపిన వ్యక్తి గౌతమ బుద్ధ.

గౌతమ బుద్ధుడు కపిలవస్తు దేశంలోని లుంబిని అనే నగరంలో జన్మించాడు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. బుద్ధుని జననం తర్వాత కొన్ని రోజులకు అతని తల్లి మరణిస్తుందని ఆ తర్వాత బుద్ధుడు ఆధ్యాత్మిక గురువుగా మారతాడని జ్యోతిష్యులు చెప్తారు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు జ్యోతిష్యులను ఈ సమస్యకు పరిష్కారం అడగగా వాళ్ళు బుద్ధునికి చావు పుట్టుకుల గురించి తెలియచేయొద్దని చెప్తారు. జ్యోతిష్యులు చెప్పినట్టు గానే బుద్ధుని తల్లి కొన్ని రోజులకే మరణిస్తుంది. అలా జ్యోతిష్యులు చెప్పినట్టుగా బుద్ధుని తల్లి చనిపోవడంతో అప్పటి నుండి బుద్ధునికి ఎటువంటి బాధ, బెంగ తెలియకుండా తండ్రి శుద్ధోదనుడు పెంచుతాడు. బుద్ధుడు అతని పినతల్లి మహా ప్రజాపతి పెంపకంలో పెరిగి పెద్దవుతాడు. అలా బుద్ధునికి 16 ఏళ్ళ వయసులో యశోధర అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది.

 

అలా కొన్ని రోజులకు బుద్ధునికి రాహులుడు అనే కొడుకు పుడతాడు. జీవితం ఎంతో ఆనందంగా ఉన్న బుద్ధునికి ఏదో తెలియని లోటు మనసును కలచివేసేది. అలా కాలం గడుస్తూ ఉండగా, ఒక రోజు బుద్ధుడు రాజ్యాన్ని వీక్షించడానికి శుద్ధోదనుడికి తెలియకుండా బయటికి వస్తాడు. బయటకు వచ్చిన బుద్ధునికి ఒక ముసలివాడు, ఒక సన్యాసి, ఒక బిచ్చగాడు, ఒక శవం కనిపిస్తాయి. ఆ దృశ్యాలను చుసిన బుద్ధునికి జీవితం పై ఆసక్తి, వ్యామోహలు తగ్గిపోతాయి. అలా బుద్ధుడు ఇంటినుండి, రాజ్యంనుండి నిష్క్రమిస్తాడు. అలా రాజ్యం నిష్క్రమించిన బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చుని 49 రోజుల పాటు ధ్యానం చేయడం ద్వారా పరమ సత్యాన్ని తెలుసుకుంటాడు. అలా తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి సంకోచిస్తాడు. 

కాని తన శిష్యుని అభ్యర్ధన వల్ల ఆ సత్యాన్ని అతనికి తెలియచేస్తాడు. అలా ఎంతో మందికి తాను తెలుసుకున్న పరమ సత్యాన్ని తెలియచేస్తాడు. ఆ విధంగా ఎంతో మందిని తన శిష్యులుగా మార్చుకుంటాడు. అలా తాను గ్రహించిన పరమ సత్యాన్ని మూడు భాగాలుగా విడదీసాడు. 

బుద్ధం:
పరిపక్వత చెందిన, మార్పు చెందిన వ్యక్తిత్వం. పరమ సత్యాన్ని గ్రహించడం. 

ధర్మం:
తను గ్రహించిన పరమ సత్యాన్ని ధర్మ మార్గంలో అనుసరించడం. ధర్మ మార్గంలో నడవడం. 

సంఘం:
చుట్టూ ఉన్న వాళ్ళందరిని నా వాళ్లే అనుకోవడం. అందరిని సమానంగా చూడడం. 

ఈ బుద్ధం,ధర్మం,సంఘం అనే మూడు మార్గాల ద్వారా ముక్తిని ప్రసాదించి ఎంతో మంది జీవితాలను మారుస్తూ, ఇప్పటికి కూడా ఎంతో మందిని తన ఆచరణల ద్వారా ముందుకు నడిపిస్తున్న బుద్ధుడికి జోహార్. 

అలా బుద్ధుడు తన 80వ ఏటా నిర్వాణం చెందాడు. 

బుద్ధుని విశిష్టమైన వచనాలు:

యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. 

నీ బాధకు కారణం ఏదైనా కావొచ్చు. కాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. 

శరీరానికి మరణం ఒక్క సారి మాత్రమే. కాని మనసుకు తప్పు చేసిన ప్రతి సారి మరణమే. 

ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. 

మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు.

21, జులై 2020, మంగళవారం

ఎలన్ మస్క్ (స్పేస్ లైఫ్ యొక్క నిజమైన వ్యూహకర్త)

ఎలన్ మస్క్



మస్క్ జూన్, 28, 1971న సౌతాఫ్రికాలో జన్మించాడు. మస్క్ తండ్రి సౌత్ ఆఫ్రికన్, తల్లి కెనడియన్. మస్క్ కు చిన్నప్పటి నుండి పుస్తకాలపై ఎంతో ఆసక్తి ఉండేది. మస్క్ 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు BASIC VIDEO GAME "BLASTAR"ని తయారుచేసి దాని యొక్క కోడ్ ని PC AND TECHNOLOGY అనే కంపెనీకి 500 డాలర్లకు అమ్మేస్తాడు.

మస్క్ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోతారు. అప్పటినుండి మస్క్ వాళ్ళ నాన్న గారి దగ్గరే ఉంటాడు. మస్క్ తండ్రి మస్క్ ని సౌతాఫ్రికాలోని కాలేజీలో చేరమంటాడు. కాని తనకు అమెరికా వెళ్లాలని ఉందని, ఎందుకంటే అమెరికాలో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతాయని అక్కడ అయితేనే తను గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుందని అక్కడికి వెళ్తానంటాడు. అలా కెనడాలో ఉన్న వాళ్ళ అమ్మ ద్వారా పాస్ పోర్ట్ పొందిన తర్వాత తన తండ్రి కోరికకు విరుద్ధంగా అక్కడికి వెళ్తాడు.

    

COLLEGE  EDUCATION

 

మస్క్ 1997 లో వార్టన్ నుండి ఆర్ధికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ మరియు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందుతాడు.

1994 లో, మస్క్ వేసవికాలం సెలవులకి సిలికాన్ వ్యాలీలో రెండు ఇంటర్న్‌షిప్‌లను చేసాడు. వీటిలో పిన్నకిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పిలువబడే ఎనర్జీ స్టోరేజ్ స్టార్ట్-అప్ లో తన మొదటి ఇంటర్న్‌షిప్ చేసాడు. మరియు పాలో ఆల్టో ఆధారిత స్టార్ట్-అప్ రాకెట్ సైన్స్ గేమ్స్ లో తన రెండవ ఇంటర్న్‌షిప్ ను చేసాడు. 

1995 లో కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎనర్జీ ఫిజిక్స్ / మెటీరియల్స్ సైన్స్ లో పిహెచ్డి చేయాలని మస్క్ అనుకుంటాడు. కాని ఇంటర్నెట్ అప్పటికే విజృంభణలో ఉండడంతో తను పిహెచ్డి చెయ్యాలనే ఆలోచనని పక్కన పెట్టి ముందుగా తన మొదటి సంస్థను మొదలు పెడతాడు. 

ZIP2


1995వ సంవత్సరంలో మస్క్ తన సోదరుడు కింబల్ తో కలిసి ZIP2 అనే వెబ్ సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపిస్తాడు. ఈ కంపెనీకి ANGEL INVESTORS గ్రూప్ పెట్టుబడి పెడుతుంది. ZIP2 కంపెనీ ద్వారా ఇంటర్నెట్ లో మ్యాప్స్, డైరెక్షన్స్, యెల్లో పేజెస్ సేవలను అందించేవారు. ZIP2 యొక్క సేవలు మెరుగ్గా ఉండడంతో ఇంకా ఎన్నో కంపెనీలు వెబ్ సేవల కోసం ఈ సంస్థతో కలుస్తాయి. అలా 1999లో COMPAQ అనే సంస్థ ZIP2ను 307 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తుంది.

X.COM AND PAYPAL

 

1999వ సంవత్సరంలో మస్క్ X.COM అనే ఆన్‌లైన్ ఆర్థిక సేవలు మరియు ఇ-మెయిల్ చెల్లింపు సంస్థను ప్రారంభిస్తాడు. ఈ సంస్థ ప్రారంభించిన ఒక సంవత్సరానికి CONFINITY అనే సంస్థ ఈ X.COM ని కొనుగోలు చేస్తుంది. ఈ CONFINITY సంస్థ నగదు చెల్లింపుల సేవలను అందించేది. అలా కొన్ని సంవత్సరాలకు CONFINITY సంస్థ తమ కంపెనీ పేరును PAYPAL గా మారుస్తుంది. ఈ PAYPAL కంపెనీకి మస్క్ CEO గా వ్యవహరించేవాడు.

SPACEX

మస్క్ మొదటి నుండి సైన్స్ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థి కావడం వల్ల విశ్వం మీద భుకక్షల మీద ఎంతో మక్కువ ఏర్పడుతుంది. ఆ మక్కువతోనే 2001వ సంవత్సరంలో మస్క్ స్పేస్ లో రాకెట్ ని పంపాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడువుగా తన స్నేహితులతో మాస్కో వెళ్తాడు. అక్కడ ఉన్న KOSMOTRAS కంపెనీ వాళ్ల దగ్గర రాకెట్ ని కొనుగోలు చేయాలని అనుకుంటాడు. వాళ్ళు ఒక రాకెట్ ఖరీదు 8 మిలియన్ డాలర్లు అని చెప్పడంతో తనే తయారు చేయాలనుకుంటాడు, ఎందుకంటే రాకెట్ ఖరీదులో మూడు శాతం వంతు డబ్బులకే మనం ఆ రాకెట్ తయారుచేయవచ్చని అలా నిర్ణయించుకుంటాడు. అలా ఒక స్పేస్ సిటీని సృష్టిస్తాడు. ఆ కంపెనీ పేరు SPACEX. 2006లో స్పేస్‌ ఎక్స్‌ తొలిరాకెట్‌ను ప్రయోగించింది. 33 సెకన్లలోనే అది పేలిపోతుంది. 2007, 2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్‌ ఆందోళనకు లోనవుతాడు. స్పేస్‌ ఎక్స్‌ దివాళ తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావిస్తారు. వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం ఆయన జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఫాల్కన్‌-1 రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది.

అంతేకాకుండా ఈ కంపెనీ మొదలైన తక్కువ రోజులలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఇంజిన్‌ల ఉత్పత్తిదారుగా మారింది. స్పేస్‌ఎక్స్ 100 కంటే ఎక్కువ మెర్లిన్ 1 డి ఇంజిన్‌లను ఉత్పత్తి చేస్తుంది. స్పేస్‌ఎక్స్ ప్రకారం, ప్రతి మెర్లిన్ 1 డి ఇంజిన్ 40 సగటు కుటుంబ కార్ల బరువును నిలువుగా ఎత్తగలదు, మరియు 9 మెర్లిన్ ఇంజన్లు 1.3 నుండి 1.5 మిలియన్ పౌండ్ల బరువును ఎత్తగలవు . 2006 లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బంది మరియు కార్గో పంపిణీకి ఎంపిక చేసిన రెండింటిలో SPACEX కంపెనీ ఒకటి అని నాసా ప్రకటించింది. అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైనదిగా మార్చాలనేది, రాకెట్లను పునర్వినియోగించాలనేది మస్క్ ఆలోచన, అయితే రాకెట్లను పునర్వినియోగపరచడం అసాధ్యమని అంతరిక్ష పరిశ్రమ నిపుణులు నమ్ముతారు. ఇప్పటి వరకు SPACEX ఎన్నో రాకెట్లను స్పేస్లోకి పంపింది. 80,000 మంది జనాభాతో 2040 నాటికి మార్స్ కాలనీని సృష్టించడమే మస్క్ లక్ష్యం.

TESLA


2002లో స్పేస్‌ ఎక్స్‌ను ప్రారంభించిన మస్క్ ఆ తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. ఈ కంపెనీ విద్యుత్తు కార్లను అభివృద్ధి చేసేది. ఈ కంపెనీ తొలి కారు ‘రోడ్‌స్టర్‌’. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది. దీంతో దీని లాంచింగ్‌ ఆలస్యమైంది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు  మస్క్. ఆ తర్వాత రోడ్‌స్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కంపెనీ వెనుదిరిగి చూసుకోలేదు.

ఇవే కాక ‘సోలార్‌ సిటీ’, ‘హైపర్‌ లూప్‌’, ఓపెన్‌ ఏఐ, న్యూరాలింక్‌, ది బోరింగ్‌ కంపెనీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు మస్క్‌ ఆలోచనల నుంచి పుట్టినవే.

18, జులై 2020, శనివారం

మనం అనుకుంటే జీవితం ఏమీ లేదు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్



జీవితం చాలా చిన్నది. ఈ చిన్నదైనా జీవితంలో ఎన్నో కోరికలు, ఆశలు, ఆలోచనలు. అటువంటి ఈ చిన్నదైనా జీవితంలో మనల్ని మనం చాలా గొప్పవాళ్లుగా మార్చుకోవడం కోసం ప్రతి నిమిషం తాపత్రేయ పడుతుంటామ్. అలా మనల్ని మనం గొప్పగా మార్చుకునే  క్రమంలో ఎన్నో అడ్డులు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఈ ప్రయాణంలో కొన్ని సార్లు మనం నిలబడలేనంతగా మన జీవితానికి దుఃఖం, బాధ కలుగుతాయి. అటువంటి సమయంలో మనం ఇంతే మన జీవితం ఇంతే  అని బాధ పడి చనిపోవడమా జీవితం అంటే?

ఎక్కడో బీహార్ లో పుట్టి హీరో అవ్వాలనే కసితో చదువును మధ్యలో వదిలేసి ముంబై వచ్చి మొదట్లో అవకాశాలు దొరక్క సీరియల్ హీరోగా నటిస్తూ కొన్ని సంవత్సరాలకు బాలీవుడ్ హీరో గా మారిన యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. 

బీహారులో పుట్టిన సుశాంత్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఫ్యామిలీతో సహా ఢిల్లీలో స్థిరపడతాడు. సుశాంత్ చిన్నప్పటి నుండి చదువులోనూ, ఆటలలోను ముందుండేవాడు. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టులో ఉత్తిర్ణుడై అక్కడే మెకానికల్ ఇంజనీర్ గా జాయిన్ అవుతాడు. చదువుకునే రోజుల్లో తన స్నేహితులతో కలిసి డాన్స్ క్లాసులకు వెళ్ళేవాడు. అక్కడ డాన్స్ చేసే వారిలో తనకంటూ ఒక ప్రత్చేక స్థానాన్ని పొందుతాడు. ఆ తర్వాత ఎన్నో ప్రతిష్ఠాత్మక ఫంక్షన్స్ లో తన డాన్సుతో ఆకట్టుకుంటాడు. డాన్సుపై ఉన్న మక్కువ క్రమంగా యాక్టింగ్ పైకి మళ్లుతుంది. యాక్టర్ అవ్వాలి అనే కోరికతో చదువును మధ్యలో వదిలేసి ముంబాయి వెళ్లిపోతాడు.


మొదట్లో సినిమాలలో అవకాశం దొరకక సీరియల్స్ లో నటిస్తాడు. సీరియల్స్ లో నటిస్తున్న సినిమాలపై మక్కువ తగ్గదు. ఆ మక్కువతో సీరియల్ లో మానేసి ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటాడు. ఎంతో కష్టపడి చివరకు బాలీవుడ్ లో KAI PO CHE అనే సినిమాతో అడుగుపెడతాడు. ఆ సినిమాలో తన యాక్టింగ్ కు ఎన్నో ప్రశంసలు అందుకుంటాడు. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక బ్యానర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ లో SHUDDH DESI ROMANCE మూవీలో నటిస్తాడు. బాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టిన అమీర్ ఖాన్ మూవీ PK సినిమాలో కూడా నటిస్తాడు. అంతేకాకుండా భారతదేశ క్రికెట్ దిగ్గజం ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన M.S.DHONI సినిమాలో నటించి సినిమా అభిమానులతోనే కాదు క్రికెట్ అభిమానులతో కూడా మెప్పు పొందుతాడు.


ఇలా చెప్పుకుంటే ఎన్నో సినిమాలలో తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాని ఇంతలో ఏమైందో తెలియదు, టీవిలో హెడ్ లైన్స్, ఫ్లాష్ న్యూస్ లో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్న వార్త. ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అసలు ఏమైంది ఎందుకు సుశాంత్ ఇలా చేసాడు అనే ప్రశ్నలతో కూడిన సుశాంత్ మరణం అతనిని ఎంతగానో ఇష్టపడే ప్రేక్షకులకు, కుటుంబసభ్యులకు తీరని లోటు మిగిల్చింది. ఒక పక్క జనాలు COVID -19 భయంతో ఇంటికే పరిమితమైన సమయంలో సుశాంత్ మరణవార్త ఒక చేదు నిజంలా మిగిలింది. కాని ఇప్పటికి తన మరణంపై ఎన్నో అనుమానాలు, అపోహలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా యువకథానాయకుడు, యువకెరటం సుశాంత్ మరణం జీర్ణించుకోలేని నిజం.

15, జులై 2020, బుధవారం

లేవండి, మేల్కొనండి మరియు మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి.

స్వామి వివేకానంద



"లేవండి మేల్కొనండి మరియు మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. " అనే అతని మాటలు చాలా మంది జీవితాలను మార్చాయి. "వెయ్యి సార్లు ఓడిపోయిన కూడా మరోసారి ప్రయత్నించండి" అనే అతని మాటలు యువతలో చైతన్యాన్ని నింపాయి. మిమ్మల్ని మీరు బలవంతులని భావించుకుంటే బలవంతులవుతారు, బలహీనులని భావించుకుంటే బలహీనులవుతారు అన్న అతని మాటలు కుంటివాడిని కూడా పరిగెత్తేలా చేశాయి. ఇలా అతని మాటలతో ఎంతో మంది జీవితాలలో మార్పు తెచ్చిన వ్యక్తి, తత్వవేత్త, వేదాంతవేత్త మరియు ఆధ్యాత్మికతను భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా వ్యాప్తి చేసిన గురు ప్రబోధకుడు శ్రీ స్వామి వివేకానంద.

 

 స్వామి వివేకానంద 1863 లో కలకత్తాలో జన్మించాడు. వివేకానంద చిన్నతనం నుండి విద్య మరియు ఆటలపై ఆసక్తి కలిగి ఉండేవాడు . క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. వివేకానంద ఎక్కువగా పుస్తకాలు మరియు పురాణాలను చదివేవాడు. స్వామి వివేకానంద ఏ పుస్తకాన్ని అయినా చాలా త్వరగా చదివేవాడు. అంతే కాకుండా పుస్తకంలో అడిగిన ఏ ప్రశ్నకైనా వెంటనే సమాధానం చెప్పే సామర్థ్యం ఉన్న మేధాసంపన్నుడు. వివేకానందుడు పాఠ్య పుస్తకాలతో పాటు పురాణ గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేసేవాడు. ఆ గ్రంథ పఠనం వల్ల అతనికి దేవునిపై మరింత ఆరాధన, ఆసక్తి కలిగాయి. అలా అతనికి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం ఏర్పడింది. దేవుడనే వాడు ఉంటే గుడి హుండీలో వేసే డబ్బులు ఎందుకు అయన తీసుకోవడం లేదు. గుడిలో మనం సమర్పించే ప్రసాదాలు ఆ దేవుడు ఎందుకు తినడం లేదు అనే ఆలోచన కలుగుతుంది. ఆ సందేహంతో వివేకానంద ఎంతో మందిని కలుస్తాడు కాని అతని ప్రశ్నకు సమాధానం దొరకదు. కాని పట్టు వదలకుండా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు.

ఆ ప్రయాణంలో రామకృష్ణ పరమహంసని కలుస్తాడు స్వామి వివేకానంద. అయనని దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతాడు దానికి సమాధానంగా రామకృష్ణ పరమహంస నవ్వుతూ దేవుడు ఉన్నాడు అని అంటాడు. అయితే నాకు దేవుడిని చూపించండి అని వివేకానందుడు రామకృష్ణ పరమహంసని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస తన స్పర్శతో వివేకానందుడికి భగవంతుని సాక్షాత్కారం చేయిస్తాడు. అప్పటి నుండి నరేంద్రుడికి రామకృష్ణులపై ఎన లేని గౌరవం, నమ్మకం ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత వివేకానందుడి తండ్రిగారు మరణిస్తారు, ఇంటిభారమంతా నరేంద్రుడిపై పడుతుంది. అప్పటి నుండి కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ ఇంటిని పోషిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రామకృష్ణ పరమహంసగారు ఆరోగ్యం బాగోక మంచాన పడతారు. అప్పుడు రామకృష్ణుడు, వివేకానందుడితో ఇలా అంటాడు, నేను చనిపోయిన తర్వాత నా ఆశ్రమాన్ని, శిష్యులను నువ్వే చూసుకోవాలి అని నరేంద్రుడికి ఆ బాధ్యతల్ని అప్పగిస్తాడు. అప్పటి నుండి ఆశ్రమాన్ని శిష్యుల బాధ్యతను వివేకానందుడు స్వీకరిస్తాడు.

ఆ తర్వాత వివేకానంద అమెరికాలో సర్వమత సమ్మేళన సభ జరుగుతుందని తెలుసుకుని అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అమెరికా వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు తన దగ్గర ఉండవు కాని వెళ్ళాలి అనే సంకల్పం మాత్రం బలంగా ఉంటుంది. వివేకానందుడు తన  ఆశ్రమానికి వచ్చే వారి సహకారంతో చివరికి ఎలా అయితే తన ప్రయాణానికి సరిపడేంత సొమ్మును సమకూర్చుకుంటాడు. అమెరికా వెళ్లిన తర్వాత ఇంకా సమ్మేళన సభకు మూడు నెలలు సమయం ఉండడంతో అక్కడే ఉన్న వివిధ ప్రాంతాల్లో తన ఉపన్యాసాలని ఇస్తాడు. ఆ ప్రసంగాలకు ఆసక్తులైన అమెరికావారు వివేకానందుడికి దాసోహం అవుతారు. అలా వివేకానంద అక్కడి సభలో ప్రసంగించకుండానే ఎంతో గుర్తింపు పొందుతాడు. ఎంతో మంది ఎన్నో దేశాలనుండి ఆ సభలో ప్రసంగించడానికి అక్కడికి వస్తారు వాళ్ళతో పాటు స్వామి వివేకానంద కూడా ఆ సభకి హాజరు అవుతాడు. అలా స్వామి వివేకానంద ప్రసంగించే సమయం ఆసన్నమవుతుంది.

స్వామి వివేకానంద ప్రసంగిస్తూ అమెరికాలోని సోదర సోదరీమణులారా అని అనగానే పది నిమిషాల పాటు సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగుతుంది. అలా వివేకానందుడి ప్రసంగం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మనసులను కదిలిస్తుంది. అలా నాలుగు సంవత్సరాల పాటు వివిధ దేశాల్లో ప్రసంగించిన తర్వాత వివేకానంద మళ్ళీ తిరిగి భారతదేశానికి 
చేరుకుంటాడు. ఇక్కడ వారందరూ ఆయనకు గొప్ప స్వాగతాన్ని అందిస్తారు. ఇలా ఇక్కడ సభలలో కూడా ప్రసంగిస్తూ ఎంతో మంది జీవితాల్లో మార్పుని తీసుకొచ్చి 1902లో స్వామి వివేకానంద మరణించాడు.

స్వామి వివేకానంద చెప్పిన కొన్ని అద్భుతమైన సూక్తులు

ఇనుపకండరాలు, ఉక్కు నరాలుతో కూడిన శరీర దృఢత్వాన్ని కలిగి ఉండాలి . 

 సింహంలా శాసించండి , గొర్రెల్లా అనుసరించకండి . 

ఓ ధీర హృదయుడా పట్టు సడలనివ్వకు.
 
గమ్యం తెలియక నియంత్రణ లేని మనసు మనల్ని అధోగతిపాలు చేస్తుంది, పతనమొందిస్తుంది. మౌనంగా ధ్యానం చేయండి, మనఃశక్తిని  సమీకరించి ఆధ్యాత్మిక శక్తిజనక యంత్రంగా మారండి.   

మహాత్మ గాంధీ (స్వాతంత్ర సమరయోధుడు)

వివేకానంద రచనలను చదివిన తరువాత నా దేశంపై నాకున్న ప్రేమ వెయ్యి రెట్లు పెరిగింది.

ఏ. పీ. జే. అబ్దుల్ కలాం ఆజాద్ (మాజీ రాష్ట్రపతి )

స్వామి వివేకానంద పిలుపు మనలో ఉన్న స్వీయ చైతన్యాన్ని మేల్కొలపడానికే కాదు మన హృదయంలో ఉన్న నిజాన్ని మనకు తెలియచేయడం .
 
నరేంద్ర మోడీ (భారతదేశ ప్రధానమంత్రి)

స్వామి వివేకానందను వెతకడమంటే సత్యాన్ని వెతకడమే.                

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...