30, నవంబర్ 2020, సోమవారం

నిజమైన గెలుపు కోసం వెతకడమే జీవితమంటే.

నిజమైన గెలుపు

ఎనిమిదేళ్ల పిల్లవాడు తనతో పాటు పరుగు పందెంలో పాల్గొన్న ప్రత్యర్థులను ఓడించి, తన గెలుపును ప్రపంచానికి పరిచయం చేయాలని ఎంతగానో ఆరాటపడుతుంటాడు. అలా మరి కొంత సేపటిలో మొదలయ్యే పరుగు పందాలను చూడడానికి ఎంతో మంది వీక్షకులు అక్కడికి వస్తారు. అంతే కాకుండా అక్కడికి వచ్చిన వారందరితో పాటు ఒక ముసలివాడు కూడా ఆ పరుగు పందెం చూడడానికి వస్తాడు. అలా ఆ పరుగు పందెం మొదలవుతుంది. ఆ పిల్లాడితో పాటు ఆ పరుగు పందెంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలవడం కోసం ఎంతో వేగంగా పరుగెడతారు, కాని ఆ పిల్లవాడు తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసితో, అందరి కంటే మరింత వేగంగా పరిగెడుతూ గెలుపును అందుకుంటాడు. అలా అక్కడ ఉన్న ప్రత్యర్థుల కంటే ముందుగా గెలుపు గీతను అందుకున్న ఆ పిల్లాడిని చూసి ప్రతి ఒక్కరు చప్పట్లతో తమ అభినందనలు తెలియచేస్తారు.


 కాని అక్కడ ఉన్న ముసలి వాడు మాత్రం ఆ పిల్లవాడికి ఎటువంటి అభినందనలు తెలపకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు. అలా ఎటువంటి అభినందనలు తెలపకుండా అక్కడ కూర్చున్న ముసలి వాడిని చూసిన పిల్లవాడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా అయిన ఆ ముసలి వాడితో అభినందనలు పొందడానికి తన కంటే పెద్దవాళ్ళతో పరుగు పందెంలో పాల్గొంటాడు. అలా ఆ పందెంలో కూడా అక్కడ ఉన్న ప్రత్యర్థులపై విజయం సాధిస్తాడు. అయినా గాని ఆ ముసలి వాడు పిల్లవాడికి ఎటువంటి అభినందనలు తెలపకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు. అది చూసిన పిల్లవాడు ఎలా అయిన ఆ ముసలి వాడితో అభినందనలు పొందాలని నిశ్చయించుకుంటాడు. అలా అక్కడికి వచ్చిన ఎంతో మంది ప్రత్యర్థులపై ఆ పిల్లవాడు విజయం సాధిస్తాడు. అలా ఎంతో మందిపై విజయం సాధించిన ఆ పిల్లవాడికి, ముసలి వాడు ఎటువంటి అభినందనలు తెలియచేయడు. అప్పుడు ఆ పిల్లవాడు కోపంతో ముసలి వాడి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు.

 

నేను ఎన్ని సార్లు గెలిచినా మీరు ఎందుకు నన్ను అభినందించట్లేదు అని పిల్లవాడు ఆ ముసలి వాడిని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వాడు ఆ పిల్లవాడితో ఇలా అంటాడు. నువ్వు నేను చెప్పిన వాళ్ళతో పోటీ పడితే నిన్ను అభినందించాలో వద్దో ఆలోచిస్తాను అని అంటాడు. దానికి ఆ పిల్లవాడు సరే అని అంటాడు. అప్పుడు ఆ ముసలి వాడు ఇద్దరు గుడ్డి వాళ్ళతో తనను పోటీ పడమంటాడు. ఆ మాటలు విన్న పిల్లవాడు గుడ్డి వాళ్ళతో పోటీనా అని అంటాడు. దానికి ఆ ముసలి వాడు నువ్వు వాళ్ళతో పోటీ పడాల్సిందే అని అంటాడు. అప్పుడు దానికి ఆ పిల్లవాడు సరే అని అంటాడు. పోటీ మొదలవుతుంది అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళందరి కంటే ముందుగా గెలుపు గీతను చేరుకుంటాడు. కాని ఆ పిల్లవాడితో పోటీపడుతున్న వాళ్ళు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. అలా వాళ్ళతో పోటీ పడి గెలిచిన ఆ పిల్లాడిని చూసి అక్కడ ఉన్న వారు ఎవరు అభినందనలు తెలియచేయరు. 

అప్పుడు ఆ పిల్లవాడికి అసలు తను గెలిచానో లేదో అనే అనుమానం కలుగుతుంది. అలా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయిన ఆ పిల్లవాడిని చూసిన ముసలివాడు తనతో ఇలా అంటాడు. నువ్వు నీ తోటి స్నేహితులపై గెలిచినప్పుడు వీళ్ళందరూ నిన్ను అభినందించారు. మరియు నీకంటే పెద్దవాళ్లతో ఆడి గెలిచినప్పుడు కూడా వీళ్ళందరూ నిన్ను అభినందించారు. కాని శరీర లోపాలతో పుట్టిన వాళ్ళపై నువ్వు గెలిచినప్పుడు మాత్రం వీళ్ళు నిన్ను అభినందించట్లేదు. దానికి గల కారణం నువ్వు  గుడ్డి వాళ్లపై గెలవడం. కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వాళ్లందరితో కలిసి ఈ పరుగు పందంలో పాల్గొను అని ఆ పిల్లాడితో చెప్తాడు. దానికి అంగీకరించిన ఆ పిల్లాడు ఆ గుడ్డి వాళ్ళతో కలిసి తన పందాన్ని మొదలు పెట్టి అందరితో కలిసి వెళ్లి విజయం సాధిస్తాడు. ఈ విధంగా చేసిన ఆ పిల్లాడిని చూసిన అక్కడి వారందరూ తమ చప్పట్లతో అభినందనలు తెలియ చేస్తారు. 

ఇలా అక్కడ జరిగినదంతా చూసిన ఆ పిల్లాడికి కంటినుండి నీళ్లు ఆగవు. అప్పుడు ఆ ముసలి వాడు ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి తనతో ఇలా అంటాడు. నువ్వు ఈ గుడ్డి వాళ్ళతో కలిసి ఆడి ఒక్కడివే గెలిచినప్పుడు వీళ్ళు అందరూ నిన్ను అభినందించలేదు. కాని నువ్వు వాళ్ళతో కలిసి ఈ పరుగు పందెంలో గెలిచినప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను గొప్పగా అభినందించారు. ఇదే నేను నీకు చెప్పాలనుకున్న నిజమైన సత్యం అని ఆ పిల్లవాడికి ఈ విషయాన్ని తెలియచేస్తాడు. అలా ఆ ముసలి వాడు ఆ చిన్న పిల్లవాడికి జీవితంలోని అసలైన గెలుపును తనకు పరిచయం చేస్తాడు. 

29, నవంబర్ 2020, ఆదివారం

మనల్ని ఆలోచింపచేసే చిన్న కప్ప కథ.


 మనల్ని ఆలోచింపచేసే చిన్న కప్ప కథ.


    
ఒక చెరువులో రెండు కప్పలు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఉండేవి. అవి ఎప్పుడు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాయి. అయితే ఈ రెండు కప్పలలో ఒకటి లావుగాను మరియు రెండవది బక్కగాను ఉండేవి. అలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు పాలు అమ్ముకునే వ్యక్తి పాలను ఒక బకెట్ లో పోసి పెరుగు అవ్వడం కోసం ఒక పక్కన ఉంచుతాడు. అటువంటి బకెట్ ను చూసిన రెండు కప్పలకు అసలు దాంట్లో ఏముందో చూడాలనిపిస్తుంది. అనుకున్నదే తడువుగా ఆ రెండు కప్పలు బకెట్ దగ్గరకు చేరుకుంటాయి. అయితే బకెట్ చాలా పొడవుగా ఉండడం వల్ల దాని లోపల ఏమున్నదో వాటికి కనిపించదు. ఎలా అయిన ఆ బకెట్ లో ఏముందో చూడాలని దానిలోనికి దూకడానికి ప్రయత్నిస్తాయి.

 

ఎంతో సేపు ప్రయత్నించిన తర్వాత ఎలా అయితే అవి రెండు బకెట్ లోకి దూకుతాయి. బకెట్ లోకి దూకిన ఆ రెండు కప్పలు ఆ పాలలో నుండి బయటకు రావడానికి కుదరక ఎగరలేక అక్కడే ఉండిపోతాయి. అలా చాలా సేపు ఈత కొట్టి కొట్టి అవి రెండు చాలా అలసిపోతాయి. ఆ సమయంలో వాటిలో  లావుగా ఉన్న కప్ప తన వల్ల కావట్లేదు ఇంక నేను ఈతకొట్టలేను అని అంటుంది అది విన్న బక్క కప్ప నువ్వు కంగారు పడి మునిగిపోకు మరి కొంతసేపు ఈత కొట్టు ఎవరొకరు వచ్చి మనల్ని కాపాడతారు అని అంటుంది. అది విన్న లావు కప్ప సరే అని ఈత కొట్టడం మొదలు పెడుతుంది. అలా సాయంత్రం అయిపోతుంది అయినా గాని ఎవరు వాటిని పట్టించుకోరు.  ఇంక ఎవరు రారని లావు కప్ప నిర్ణయించుకుని మునిగిపోతాను అని తన స్నేహితుడైన బక్క కప్పతో చెబుతుంది. దానికి ఆ బక్క కప్ప వద్దు వద్దు అని ఆ లావు కప్పకు ఎంతగానో చెప్పి చూస్తుంది. 

అయినా గాని వినిపించుకొని లావు కప్ప పాలలోకి మునిగిపోయి మరణిస్తుంది. అలా ఆ బక్క కప్ప తన స్నేహితుడైన లావు కప్పను కోల్పోతుంది. అలా తన స్నేహితుడు మరణించినా కూడా ఆ బక్క కప్ప ఈత కొట్టడం ఆపదు. ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండగా కొంత సేపటికి ఆ పాలు పెరుగుగా మారతాయి. ఆ పాలు పెరుగుగా మారి గట్టిగా అవ్వడం వల్ల ఆ బక్క కప్ప బకెట్ లో నుండి బయటకి దూకేసి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. అలా బకెట్ నుండి బయటకు దూకి తన ప్రాణాలు కాపాడుకున్న కప్పకు, తను బ్రతికాను అన్న సంతోషం కంటే తన ప్రాణ స్నేహితుడు మరణించాడన్న బాధే ఎక్కువగా ఉంటుంది. అలా ప్రాణాలు కాపాడుకున్న ఆ కప్ప కొన్ని రోజులకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుంది. ఆ కప్ప ఎప్పుడు తన పిల్లలకు, తన జీవితంలో ఎదురైన సమస్యను గురించి చెబుతూ ఉండేది. అలా తన పిల్లలతో ఈ విషయం గురించి చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా దేన్ని సులువుగా వదలొద్దు అని చెప్తుంది. 

28, నవంబర్ 2020, శనివారం

వాట్సాప్,ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారాలు చేస్తూ విజయం అందుకుంటున్న నేటితరం మహిళలు.

ఆన్ లైన్ వ్యాపారాలలో మహిళా శక్తి


వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను ఛాటింగ్ చేయడం కోసం, వీడియోస్,  ఫొటోస్ షేర్ చేయడం కోసం మాత్రమే ఈనాటి యువతరం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి సామాజిక మాధ్యమాలను ఛాటింగ్ కోసమే కాదు వ్యాపారం చెయ్యడం కోసం ఉపయోగించవచ్చు, గొప్పగా డబ్బులు సంపాదించవచ్చు అని కొంతమంది మహిళలు నిరూపిస్తున్నారు. అలా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను ఉపయోగించి వ్యాపారం చేస్తూ ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ  మహిళ పేరు  ప్రియాంక శర్మ. ఈమె 90,000 రూపాయల అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టి ఈ రోజు లక్షలలో ఆదాయాన్ని సంపాదిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. 


ప్రియాంక శర్మ ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ అండ్ జర్నలిజం కోర్సులో మాస్టర్ డిగ్రీ అందుకుంది. అయితే ప్రియాంకకు మొదటి నుండి ఫ్యాన్సీ ఐటమ్స్, గోడగడియారాలు, చిన్న చిన్న కళాకృతులు తయారు చేయడంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే స్ట్రింగ్ నేమ్ ప్లేట్స్, డోర్ హ్యాంగింగ్స్, చెక్కిన బోర్డులు, చెక్క బహుమతులు తయారుచేసేది. అయితే ఒకరోజు ప్రియాంక తను చేసిన వస్తువులను అమ్ముదాం అని తన సోదరి అయిన అంజలితో చెపుతుంది. ఆ మాటలు విన్న ఆమె సోదరి అందుకు అంగీకరిస్తుంది. అలా హారన్ ఓకే ప్లీజ్ అనే పేరుతో ఢిల్లీలో జరిగే ఉత్సవ మేళాలలో తాము చేసిన వస్తువులను అమ్మడం మొదలు పెడతారు. అలా తమ వ్యాపారంలో మొదటి అడుగు వేస్తారు. అయితే ఈ వ్యాపారం చక్కటి విజయం సాధించడంతో తమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించుకుంటారు.

 

అలా ఆగస్ట్, 2019వ సంవత్సరంలో  డూడుల్ హట్స్ డిజైన్స్ అనే పేరుతో తమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్మడం మొదలు పెడతారు. అందుకోసం వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు. వీరు అమ్మే వస్తువులు 299 రూపాయల నుండి 3500 రూపాయల వరకు ఉంటాయి. అంతేకాకుండా వీరు తమకు వచ్చిన ఆర్డర్స్ ని భారతదేశంలోని ఏ ప్రాంతంకైనా 4 నుండి 7 రోజులలో డెలివరీ చేస్తారు. 90,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ వ్యాపారం అతి తక్కువ రోజులలోనే 3 ఇంతలు ఆదాయాన్ని సంపాదించింది. అంతేకాకుండా వీరు వస్తువులను పోస్ట్ చేసిన 2 గంటలలోనే మొత్తం అమ్ముడైపోతున్నాయి అని ప్రియాంక చెపుతున్నారు.  
 

వ్యాపారం కొంచెం కొంచెం అభివృద్ధి చెందడంతో ఆన్ లైన్ లో ఆర్డర్స్ కూడా పెరిగాయి. ఒకేసారి ఆర్డర్స్ పెరగడం వల్ల ప్యాకింగ్ చేయడం కష్టమయ్యేది. అందుకోసం 8 మంది మహిళా ఉద్యోగులను నియమించుకున్నారు. అలా వారు నియమించుకున్న ఉద్యోగులు  ప్యాకింగ్, ఫాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసేవారు. అయితే వీరికి ముందుగానే 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగంలో నియమించుకున్నారు. కోవిడ్ -19 లాక్ డౌన్ లో ఆన్ లైన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగిందని తమ వస్తువులు బాగా అమ్ముడుపోయాయని ఆమె అంటున్నారు. 

కళలు మరియు చేతి ఉత్పత్తులు ఆన్ లైన్ లో కొత్త వ్యాపారం కానప్పటికి, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా తాము విజయం సాధించాం అని ఆమె చెబుతున్నారు. అంతేకాకుండా ఇ-కామర్స్ వ్యాపారం ముందు ముందు రోజుల్లో మరింతగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. 

27, నవంబర్ 2020, శుక్రవారం

విజయం అనేది పనిచేసే వారి జీవితంలోకి సర్వసాధారణంగా వస్తుంది.

విజయానికి సంకేతం గెలుపా


పొద్దున్న 7 గంటలకు లేస్తాం హడావిడి హడావిడిగా మన రోజువారీ పనులకు బయలుదేరతామ్. సాయంత్రం పని అయ్యాక ఇంటికి వస్తాం భోజనం చేసి కొంతసేపు టీవీ చూసి పడుకుండిపోతాం. మళ్ళీ తర్వాత రోజు ఉదయం లెగుస్తామ్ మళ్ళీ మన రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటాం. ఇంక వీకెండ్ హాలిడేస్ లో నిద్రపోవడం, సినిమాలు చూడడం, టైం పాస్ చేయడం. ఇంక వీకెండ్ హాలిడే అయిపోయిందంటే ఆ తర్వాత మళ్ళీ  అంత మాములే. ఇలానే జీవితం గడుస్తూ ఉంటే కొన్ని రోజులకు మనకు ఈ జీవితం ఏంట్రా బాబు అసలు ఎమ్ జరుగుతుంది అన్న ఆలోచన, దాని నుండి బాధ, జీవితం ఇంక అయిపోయింది రా బాబు అన్న నిరాశ కలగడం మొదలువుతుంది. కొంత మంది సున్నితమనస్కులు తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు.


మనం పైన మాట్లాడుకున్న విషయాలలో ఏవి కూడా మనం అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి మనకు నిరాశ, నిస్పృహ కలుగుతున్నాయి. కాని మనం ఎప్పుడైనా ఇది కావాలి అని దానికోసం వెళ్తామా లేదు, అందరిలాగానే స్కూల్ లో చదువుతాం, ఆ తర్వాత కాలేజీలో చదువు, గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత మంచి జాబ్ కోసం ప్రయత్నం. జాబ్ లో జాయిన్ అయ్యి డబ్బు సంపాదించడం మొదలు పెడతాం. కొన్ని రోజులకు పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత పిల్లల్ని కంటాం . వాళ్ళ చదువు కోసం వాళ్ళ జీవితం కోసం వాళ్ళ మంచి భవిషత్తు కోసం కష్టపడతాం కొన్ని సంవత్సరాలకు ముసలి వాళ్ళం అవుతాం తర్వాత చనిపోతాం.

 

కాని ఒక్క విషయం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అది ఏమిటంటే మనం ఏమి చేసిన చెయ్యకపోయినా కాలం అనేది మాత్రం ఎవరికోసం ఆగదు. కాబట్టి అందరిలాగా కాకుండా ఏదైనా కొత్తగా, చరిత్రలో నిలిచిపోయే పనిని చేయడానికి ప్రయత్నిద్దాం. మనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చూసుకుందాం. మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందాం. ఎంతటి కష్టం వచ్చిన వెనకడుగు వేయకుండా పట్టుదలగా ముందుకు సాగుదాం, మన చివరి నిమిషం వరకు పని చేస్తూనే ఉందాం మనం అనుకున్న దాన్ని సాధించుకుందాం. ఎందుకంటే బిల్ గేట్స్ అనిపించుకోవడం చాలా కష్టం. కాని బికారి అనిపించుకోవడం చాలా సులువు. 

26, నవంబర్ 2020, గురువారం

ఒక సంస్థ యొక్క బ్రాండ్ అనేది ఒక వ్యక్తి యొక్క ఖ్యాతి లాంటిది. కఠినమైన పనులను చక్కగా చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఖ్యాతిని సంపాదిస్తారు.

జెఫ్ బెజోస్


డబ్బు సంపాదించాలి, అందరిలోను గొప్ప పేరు పొందాలి అని ఎంతో మంది ఆశ పడతారు. కాని ఆ అవకాశం కొంత మందికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం అంత సులువైన విషయం కాదు కాబట్టి. తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనుదిరిగి చూడకుండా తనపై తనకున్న నమ్మకంతో, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తుల వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంటర్నెట్, ప్రపంచానికి కొంచెం కొంచెంగా పరిచయమవుతున్న సమయంలో ఆన్ లైన్ లో వస్తువులు అమ్మడం ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అని ఒక వ్యక్తి నమ్మి పెద్ద కంపెనీలో జాబ్ ని వదిలేసి వచ్చి సొంతంగా వ్యాపారం మొదలు పెడతాడు. అలా అతను చేసిన పనికి తన చుట్టూ ఉన్న వారు నవ్వుతారు, తిడతారు, నువ్వు అప్పులపాలై పోతావు అని భయపెడతారు, కాని అతను భయపడలేదు, తనపై తనకున్న నమ్మకాన్ని కోల్పోలేదు. అంతే కాదు వ్యాపారం మొదలు పెట్టిన 4 సంవత్సరాల వరకు ఎటువంటి ఆదాయం రాకపోయిన నిరుత్సహపడలేదు. 
అలా ఎంతో పట్టుదలగా నిలబడి ఈ రోజు ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలో మొదటి వాడిగా నిలబడ్డ వ్యక్తి, అమెజాన్ సంస్థల అధినేత మరియు ఆ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్


బాల్యం మరియు విధ్యాబ్యాసం :

 
జెఫ్ బెజోస్ అసలు పేరు జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్సెన్. జెఫ్ బెజోస్ న్యూ మెక్సికో స్టేట్ లోని  అల్బుకెర్కీ అనే నగరంలో జన్మించాడు. జెఫ్ బెజోస్ జనవరి 12,1964న జాక్లిన్, టెడ్ జోర్గెన్సెన్ అనే దంపతులకు జన్మించాడు. జెఫ్ కు నాలుగు ఏళ్ళ వయసున్నప్పుడు తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోతారు. అలా వాళ్లిదరు విడిపోయిన తర్వాత జెఫ్ తల్లి క్యూబా వలసదారుడైన మైక్ ని పెళ్లి చేసుకుంటుంది. అలా జెఫ్ రెండవ తండ్రి మైక్, జెఫ్ ని దత్తత తీసుకుని, అతని పేరులోని  జోర్గెన్సెన్ ని బెజోస్ గా మారుస్తాడు. అప్పటినుండి జెఫ్ ప్రెస్టన్ బెజోస్ గా అతని పేరు మారుతుంది. జెఫ్ రివర్ ఓక్స్ ఎలెమెంట్రీ స్కూల్ లో చదువుతాడు. ప్రిన్సుటన్ యూనివర్సిటీ నుండి 4. జి.పి.యే తో తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందుతాడు.


వ్యక్తిగత విషయాలు : 


1993లో జెఫ్, మాకెంజీ స్కాట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు. 2019లో కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్లిద్దరు విడాకులు తీసుకుని విడిపోతారు. అయితే జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మాకెంజీ స్కాట్ తో విడాకులు తీసుకుని విడిపోవడం కోసం 38 బిలియన్లు చెల్లిస్తాడు. అలా ఈ విడాకులు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక లారెన్ శాంచెజ్ అనే ఆవిడను జెఫ్ బెజోస్ పెళ్లి చేసుకుంటాడు.

జెఫ్ బెజోస్ మొదటగా ఫీటల్ అనే టెలీకమ్యూనికేషన్ కంపెనీలో హెడ్ అఫ్ డెవలప్మెంట్ గాను, డైరెక్టర్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ గాను పని చేసాడు. అంతే కాకుండా బ్యాంక్ ట్రస్ట్ అనే బ్యాంకింగ్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ గా కూడా పనిచేసాడు. 30 ఏళ్ళ వయసులో డి.ఇ.షా అనే హెడ్జ్ ఫండ్ కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించాడు.
 

అమెజాన్ :


జెఫ్ బెజోస్ 1994వ సంవత్సరంలో అమెజాన్ అనే ఆన్ లైన్ ప్రోడక్ట్ డెలివరీ కంపెనీని స్థాపించాడు. జెఫ్ తన తల్లిదండ్రుల దగ్గర 3 లక్షల డాలర్లను తీసుకుని తన కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అలా మొదట్లో అమెజాన్ అమెరికాలోని కొన్ని ప్రదేశాలకు మాత్రమే వస్తువులను డెలివరీ చేసేది. అయితే అమెజాన్ యొక్క పనితీరు, డెలివరీ వేగంగా ఉండడం వల్ల ఎక్కువమంది ఇక్కడ కొనడానికి ఇష్టపడేవారు. మొదట్లో బుక్స్ మాత్రం సప్లై చేసే అమెజాన్ తర్వాతి రోజుల్లో
సి. డి.లు, డీవీడీ ప్లేయర్స్ లాంటివి కూడా డెలివరీ చేసేది. అలా నాలుగు సంవత్సరాల పాటు అలుపెరగని వ్యాపారాన్ని చేసిన తర్వాత కంపెనీ లాభాల బాట పట్టింది. కంపెనీ యొక్క అభివృద్ధి కోసం 2000 సంవత్సరంలో 2 బిలియన్ డాలర్లను బ్యాంకులో అప్పు తీసుకుంటాడు జెఫ్. ఆ డబ్బులతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మొదలు పెడతాడు. 
 
కంపెనీ మంచిగా లాభాల బాటలో నడుస్తుండగా అకస్మాత్తుగా వెబ్ బబుల్ బరస్ట్ ఏర్పడుతుంది. ఆ బబుల్ వల్ల కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వస్తుంది. అయిన గాని జెఫ్ భయపడడు. కంపెనీని ముందుండి బలంగా నిలబెడతాడు. కంపెనీలో నష్టాలను నెమ్మది నెమ్మదిగా చక్కదిద్దుతూ 2003లో మళ్ళీ కంపెనీ లాభాలబాట పట్టేలా చేస్తాడు. బెజోస్ తన కంపెనీ యొక్క 1 మిలియన్ షేర్స్ అమ్మడం ద్వారా వచ్చిన 756 మిలియన్ డాలర్లతో తన కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ను ప్రారంభిస్తాడు. అలా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలను చేయడం ద్వారా కంపెనీని ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా మార్చాడు. జెఫ్ బెజోస్ అమెజాన్ తో పాటు అమెజాన్ కిండల్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ఫైర్ స్టిక్, అమెజాన్ పేమెంట్ సర్వీసెస్ లాంటి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసాడు. అలా 2018 లో 160 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.          

సెప్టెంబర్ 2000వ సంవత్సరంలో, బెజోస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ స్టార్టప్ సంస్థ బ్లూ ఆరిజిన్ ను స్థాపించాడు. జెఫ్ స్పేస్ ప్రయాణాన్ని చాలా సులభతరం చేసి మనుషులు స్పేస్ లో బ్రతకడానికి కావలసిన పరిస్థితులను ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఈ బ్లూ ఆరిజిన్ సంస్థను స్థాపించాడు.
 
జెఫ్ బెజోస్ 5 ఆగష్టు 2013న ప్రముఖ మ్యాగజిన్ కంపెనీ అయిన ది వాషింగ్టన్ పోస్ట్ ను 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు.    

25, నవంబర్ 2020, బుధవారం

నాయకుడిగా, మీ స్వంత విజయాన్ని చూడటమే కాదు, ఇతరుల విజయంపై కూడా దృష్టి పెట్టండి.

సుందర్ పిచాయ్


మనం ఏదైనా కొత్త పనిని మొదలుపెడితే మనకి ఆ పని మీద అవగాహన లేక భయం, మనం చేయగలమా లేదా అనే అనుమానం కలుగుతుంది. కాని మనం పట్టుదలతో, బలంగా నిలబడడం ద్వారా మన పనిలో ముందుకు సాగుతూ మనలోని భయాన్ని, అనుమానాలను దూరం చేసుకుని  విజయాన్ని సాధించగలుగుతాం. అలా తన చదువు నిమిత్తం వేరే దేశానికీ వెళ్లి మొదట్లో అక్కడ ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నా వాటిని ఎదురుకుని బలంగా నిలబడి ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ సెర్చ్ రిజల్ట్స్ పొందుతున్న ప్రతిష్ఠాత్మక కంపెనీ అయిన గూగుల్ లో ఉద్యోగం సంపాదించడమే కాకుండా అతితక్కువ కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీ ప్రస్తుత సీఈఓగా వ్యవహరిస్తున్న భారతీయ దిగ్గజం సుందర్ పిచాయ్.


బాల్యం మరియు విధ్యాబ్యాసం :


సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్. సుందర్ పిచాయ్ 1972 జూన్ 10న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించాడు. సుందర్ పిచాయ్ లక్ష్మి, రేగునాత పిచాయ్ అనే దంపతులకు జన్మించాడు. పిచాయ్ జవహర్ విద్యాలయంలో తన స్కూలింగ్ ను, వన వాణి స్కూల్ లో తన 12వ తరగతిని పూర్తి చేసాడు. మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ లో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసాడు. అంతేకాకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఎం.ఎస్ చేసాడు. ఇంకా వార్టన్ స్కూల్ అఫ్ ది యూనివర్సిటీ అఫ్ పెన్నీసెల్వాని లో ఎంబీఏ పూర్తి చేసాడు.

 

వ్యక్తిగత విషయాలు : 


పిచాయ్ కాలేజీలో తనతో పాటు చదువుకున్న స్నేహితురాలు అయిన అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. సుందర్ కు ఫుట్ బాల్, క్రికెట్ అంటే చాలా ఇష్టం. 

గూగుల్ : 


పిచాయ్ మొదట్లో మకిన్సాయ్ అనే కంపెనీలో మానేజ్మెంట్ కన్సల్టింగ్ టీమ్ లో పని చేసేవాడు. 
2004లో గూగుల్ కంపెనీలో చేరాడు. పిచాయ్ గూగుల్ ప్రొడక్ట్స్ అయిన గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓ.ఎస్, గూగుల్ డ్రైవ్, క్రోమ్ బుక్ విభాగాల యొక్క అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాడు. మరియు జిమెయిల్, గూగుల్ మ్యాప్స్ యొక్క ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలా పిచాయ్ 
యొక్క కృషిని, కంపెనీ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడుతున్న తన విధానాన్ని చుసిన గూగుల్, 5 ఆగష్టు 2015 న అతనిని తమ సంస్థ యొక్క సీఈఓగా నియమించింది.

అంతే కాకుండా గూగుల్ యొక్క మాతృ సంస్థగా పిలవబడే ఆల్ఫాబెట్ కంపెనీకి 2019 డిసెంబర్ న  సీఈఓగా పిచాయ్ నియమించబడ్డాడు. 

24, నవంబర్ 2020, మంగళవారం

అనగనగా రాగ మతిశయిల్లుచుండు తినగ తినగ వేము తియ్యనుండు.

 

సకల ఆరోగ్యదాయిని వేప


ప్రకృతి ప్రసాదించిన ఔషధ చెట్లలో వేపచెట్టు ప్రముఖమైనది. ఈ వేపచెట్టు యొక్క భాగాలను ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా వేపపుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. వేప పుల్ల యొక్క రసం శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపించడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. కంటిలో దుమ్ము పడినప్పుడు వేపచుప్ ను కంటిలో వేసి కంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. చర్మసౌందర్యానికి ఉపయోగపడే బ్యూటీ ప్రొడక్ట్స్ లో మరియు సబ్బుల తయారీలో కూడా ఈ వేపను ఉపయోగిస్తారు. 


వేపచెట్టు మహోగాని కుటుంబానికి చెందినది. వేపచెట్టుకు పుట్టిల్లుగా భారతదేశం,బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ దేశాలు ప్రసిద్ధిచెందాయి. వేపచెట్టును సంస్కృతంలో నీమ్ వృక్షం, అరబిక్ లో నీబ్, కన్నడలో వేపు,తమిళంలో వెప్పం, మలయాళంలో ఆర్య వెప్పు అని పిలుస్తారు. ఆఫ్రికాలో దీన్ని నలభై రకాల రోగాలను నయం చేసే చెట్టుగా భావిస్తారు. 

వేప చెట్టు యొక్క ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. మాములుగా వేపచెట్లు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. వేపు చెట్టుకు కొమ్మలు, ఆకులు ఎక్కువగా ఉంటాయి. వేపచెట్టు యొక్క ఎదుగుదలకు కొమ్మలు ఆకులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వేపచెట్టు కొమ్మలకు బెరడ్లు ఉంటాయి. ఆ బెరడు లోపల చెక్క ఉంటుంది. ఆ చెక్కను ఎక్కువగా ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతే కాకుండా వేపచెట్టుకు కాసే కాయలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు. 

ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగనివారిణిగా భావిస్తారు. చరకుడు అనే ఆయుర్వేదవైద్యుడు వేపచెట్టు గురించి ఇలా అన్నాడు. ఎవరైతే పగటి పూట వేపచెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు. తెలుగువారు సాంప్రదాయబద్ధంగా చేసుకునే ఉగాది పండుగలో ఉగాది పచ్చడిలో పులుపు కోసం వేప పువ్వు వినియోగిస్తారు. వేపపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూలు, చర్మ సౌందర్య ఔషధాలలో వినియోగిస్తారు.

చర్మవ్యాధులైన గజ్జి, తామర వచ్చినప్పుడు ఈ వేప ఆకుల గుజ్జును పూతగా పూస్తారు. అమ్మవారు వచ్చినప్పుడు  వేపాకులపై పడుకోబెడతారు. పొట్టలో పురుగులు, మధుమేహం వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 


వేపచెట్టు యొక్క ఉపయోగాలు :


1) వేపచెట్టు పువ్వు ను ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం ఉపయోగిస్తారు. 
2) వేప పుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. 
3) వేపను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. 
4) వేప చూపును కంటిలోని మలినాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 
5) అమ్మవారు వచ్చినప్పుడు వేప ఆకులపై పడుకోబెడతారు. 
6) మధుమేహం లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. 
7) చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. 
7) వేపను చెక్కను మంచాలు, కుర్చీల తయారీలో ఉపయోగిస్తారు. 

21, నవంబర్ 2020, శనివారం

యోగా చేస్తూ మీ శరీరాన్ని, మనసును ధృడంగా ఉంచుకోండి.

యోగా ఆసనాలు


5000 సంవత్సరాల నుండి భారతదేశ సంస్కృతిలో భాగంగా ఎంతో మందికి శారీరక బలాన్ని, మానసిక సంతృప్తిని కలిగించిన పురాతన పద్ధతి యోగా. ప్రతి రోజు ఉదయం లేవగానే యోగాతో మన రోజును ప్రారంభించడం ద్వారా మనం ఆనందంగా మరియు సంతోషంగా మన పనులను చేసుకోగలుగుతాం. అంతే కాకుండా ఉపిరికి సంబంధించిన శారీరక వ్యాధులనుండి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. వృద్ధాప్యం ద్వారా వచ్చే ముడతలను ఆలస్యంగా రప్పించడానికి మరియు ముఖం ప్రకాశవంతంగా ఉండడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

యోగా మన శరీరంలోని అన్ని అవయవాలని ఉత్తేజపరుస్తూ,వాటి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. యోగాలో భాగమైన ఉఛ్వాస,నిఛ్వాస ప్రక్రియల ద్వారా మన ఊపిరితిత్తులను,శ్వాసక్రియ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. 

పురాతన యోగాలోని కొన్ని రకాలను గురించి తెలుసుకుందాం. 

1) అష్టాంగ యోగా :


ఈ యోగా విధానం పురాతన యోగా ఆసనాలను మనకు అందిస్తుంది. 1970వ సంవత్సర కాలంలో ఈ యోగా విధానాన్ని ఎక్కువ మంది ఇష్టపడేవారు. ఈ యోగా లోని ఫోజులకు  మన ఊపిరి కేంద్ర బిందువుగా ఉంటుంది. 

2) బిక్రమ్ యోగా :


ఈ యోగా విధానాన్ని హాట్ యోగా అని కూడా అంటారు. ఈ యోగాను 105 డిగ్రీల వేడి మరియు 40 శాతం తేమ ఉన్న గదిలో చేస్తారు. ఈ యోగాలో 26 ఆసనాలు ఉంటాయి. 

3) హత యోగా :


ఈ హత యోగా ఒక శారీరక వ్యాయామ విధానం. కొత్తగా ఎవరైనా యోగా మొదలు పెడితే ఇక్కడి నుండే మొదలు పెడతారు.

4) అయ్యంగార్ యోగా :


యోగా మ్యాట్,దుప్పట,కుర్చీలు,బల్లలపై ఉండి చేసే యోగా,అయ్యంగార్ యోగా. 

5) జీవముక్తి యోగా :


ఈ జీవముక్తి యోగాను జపం,ధ్యానం,ప్రాణాయామం,ఆసనం రూపంలో మనం చేస్తాం. అయితే ఈ యోగాను చేయడం కోసం కొంచెం కఠినంగా కష్టపడాలి. 

6) క్రిపాలు యోగా :


ఈ యోగా విధానం,యోగా శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. సాధారణంగా ఈ యోగా శ్వాస,చిన్నపాటి భంగిమలను కలిగి ఉంటుంది. 

7) కుండలిని యోగా :


ఈ కుండలిని యోగా యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న అంతర్ శక్తిని వెలికితీయడం. 

8) శివానంద యోగా :


ఈ ఆసనం 5 నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. అవి ఊపిరి,విశ్రాంతి,
డైట్,వ్యాయామం మరియు ప్రశాంతమైన ఆలోచనలు. 

9) పవర్ యోగా :


ఈ యోగాను 1980లో కొంత మంది అథ్లెటిక్ అధ్యాపకులు కనిపెట్టారు. అయితే ఈ పవర్ యోగా ప్రధమ ఉద్దేశం శరీర దృఢత్వం. 

18, నవంబర్ 2020, బుధవారం

ఖాదీ పరిశ్రమ గ్రామాల సౌరవ్యవస్థకు సూర్యుడు లాంటిది.

గాంధీ మెచ్చిన ఖాదీ


చేతి మగ్గాలపై సహజమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన వస్త్రాలను ఖాదీ అంటాం. ఈ ఖాదీ పరిశ్రమలు ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ ఖాదీ వస్త్రాలు భారతదేశ శాంతికి చిహ్నాలుగా ప్రతిష్ట పొందాయి. గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న సమయంలో స్వదేశీ నినాదం ద్వారా మగ్గంపై ఖాదీని తయారు చేసుకుని వాటిని వాడమని భారతదేశ ప్రజలకు విన్నవించాడు. అంతేకాకుండా మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఖాదీ వస్త్రాలను ధరించడం ద్వారా తనకు దేశంపై ఉన్న ప్రేమను, స్వదేశీ నినాదాన్ని మనకు తెలియచేస్తున్నారు. 


ఖాదిని ఖద్దర్ అని కూడా అంటారు. మొదట్లో భారతీయ జెండాలో ఈ ఖాదీ చక్రం ఉండేది. కాలక్రమేణ భారతీయ జెండాలో అశోక చక్రాన్ని ఉంచారు. అయితే 20వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం పనులకు నిరసనగా విదేశీ వస్తువులను కొనకూడని గాంధీ నినాదాన్ని లేవనెత్తారు, దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం వేరే దేశాల నుండి బట్టలను కొనుక్కొని వచ్చి వాటినే ఇక్కడ వాడాలని ఆజ్ఞాపించేది. అందుకు వ్యతిరేకంగా భారతీయ ఖద్దర్ నే వాడేవారు. అలా భారతదేశంలో ఖాదీ బట్టలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. 

ఈ ఖాదీ బట్టలు యొక్క కఠినమైన ఆకృతి చలికాలంలో చలి నుండి మనల్ని రక్షిస్తుంది. వేసవి కాలంలో ఒంటి చెమటను తగ్గించి ఎల్లప్పుడు తాజాగా ఉండేలా చేస్తాయి.

భారతదేశంలో ఈ ఖాదీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, 
తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ఖాదితో హ్యాండ్లూమ్ చీరలు, ధోతిలు, తువ్వాలలు, చంబా రుమాల్, తుస్సర్ చీరలు తయారుచేస్తారు. ఇండియాలో మన్యవర్ అనే కంపెనీ ఖాదీ వస్తువులను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించింది.

భారతీయ మాస్టర్ చేనేత డిజైనర్ మరియు పద్మశ్రీ గ్రహీత గజమ్ అంజయ్య,  ఇకాట్ ప్రక్రియ ఆధారంగా ఉత్పత్తులను నేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. 2017వ సంవత్సరానికి  ఖాదీ ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలలో మొత్తం 4,60,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతదేశంలో 2019 సంవత్సరం నాటికి ఖాదీ వస్తువుల ద్వారా వచ్చే ఆదాయం 3215 కోట్లుగా ఉంది. అయితే భారతప్రభుత్వం ఆ ఆదాయాన్ని 5000 కోట్లకు చేర్చడానికి ప్రయత్నిస్తుంది. 

15, నవంబర్ 2020, ఆదివారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుందాం. శరీరాన్ని బలంగా, ధృఢంగా ఉంచుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు


మనిషి పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేది ఆహారం, ఒక మనిషికే కాదు ఈ విశ్వంలో ఉన్న అనేకరకాలైన జంతువులు, కీటకాలు, పక్షుల జీవన మనుగడకు ఈ ఆహారం ఎంతగానో అవసరం. ఇలా మనిషి బ్రతకడానికి ఆధారమైన ఈ ఆహారాన్నిసమయానికి తీసుకోకపోవడం, వేరేవారిమీద కోపంతో తినకపోవడం, ఏది పడితే అది తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఒక ప్రపంచ సంస్థ ఆహారంపై చేసిన పరిశోధనలలో తెలిసిందేంటంటే, ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు వృధా చేసే ఆహారం ఎన్నో లక్షల మందికి కడుపు నింపుతుందని వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలో ముందు ముందు రోజుల్లో దారుణమైన ఆహారపు కొరత వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ తన పరిశోధనల ద్వారా వెల్లడించింది.


మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. అటువంటి ఆరోగ్యాన్ని అందించే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, విత్తనాలు, చపాతీలు, దంపుడుబియ్యం, మొలకెత్తిన విత్తనాలు మొదలైనవి మంచి పోషకవిలువలు ఉన్న ఆహారపదార్థాలు. 


ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా వచ్చే కొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.


1) మన శరీర బరువును తగ్గించుకోవడంలో ఈ ఆహారపదార్థాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

2) కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవి మనకు సహకరిస్తాయి.
 
3) మధుమేహవ్యాధి ద్వారా వచ్చే చెడు దుష్పరిణామాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాయి.
 
4) గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండె పోటు లాంటి జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కావలసిన శక్తిని మన శరీరానికి అందిస్తాయి.

5) మన ముందు తరాల వారి యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండడం కోసం మనకు ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

6) మన శరీరంలోని ఎముకలు, కండరాలు, దంతాలు బలంగా ఉండడం కోసం ఇవి మనకు సహకరిస్తాయి.
 
7) మన మనసు యొక్క ప్రశాంతతను పెంపొందించడంలో ఈ ఆహార పదార్థాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. 

8) మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహకరిస్తాయి. 

9) రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి  సహకరిస్తాయి. 

12, నవంబర్ 2020, గురువారం

ప్రతి వైఫల్యం ఒక మంచి పనికి మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి.

కల్నల్ సాండర్స్  (కే.ఎఫ్.సి)


జీవితం అంటే ఒక ప్రయాణం. పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం జీవితం అనే ప్రయాణంలో అలుపెరగని పోరాటాన్ని చేస్తాం. ఈ ప్రయాణంలో మనం ఒక సారి గెలుస్తాం మరొకసారి ఓడిపోతాం. కొంత మంది ఓటమిని అంగీకరించలేక బలన్మరణానికి పాల్పడతారు. మరికొందరు ప్రతి ఓటమి రేపటి గెలుపుకు పునాది అని భావిస్తారు. అలా తన జీవితంలో తను చేస్తున్న ప్రతి పని కూడా అతనిని ఓడిస్తూనే వచ్చింది. ఎన్నో సార్లు బాధతో నిద్రలేని రోజులు గడిపాడు. కొన్ని సార్లు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. కాని అటువంటి ఆలోచనలన్నింటి నుండి బయటకు వచ్చి బలమైన ప్రయత్నాన్ని చేస్తూ శక్తిమంతుడిలా నిలబడ్డాడు. అలా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. అతను మరెవరో కాదు చాలా మందికి ఇష్టమైనఫ్రైడ్ చికెన్ ని తయారుచేసే  కే.ఎఫ్.సి. కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ .

 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


కల్నల్ సాండర్స్ అసలు పేరు హర్లాండ్ డేవిడ్ సాండర్స్. ఇతను 9 సెప్టెంబర్ 1890లో అమెరికాలో ఉన్న ఇండియానా అనే స్టేట్ లోని హెన్రీవిల్లే అనే పట్టణంలో జన్మించాడు. సాండర్స్ విల్బర్ డేవిడ్, మార్గరెట్ అన్ సాండర్స్ అనే దంపతులకు జన్మించాడు. సాండర్స్ చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం వల్ల ఇంటి భారం మొత్తం తన తల్లిపై పడుతుంది. అలా ఇంట్లోని  పరిస్థితుల వల్ల సాండర్స్ తన సెవెంత్ గ్రేడ్ విద్య పూర్తయిన తర్వాత చదువు మానేస్తాడు.


వ్యక్తిగత విషయాలు : 


సాండర్స్ 1909వ సంవత్సరంలో  జోసెఫిన్ కింగ్ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు.1947లో సాండర్స్ తన భార్య అయిన జోసెఫిన్ కింగ్ నుండి విడాకులు తీసుకుని విడిపోతాడు. ఆమె నుండి విడాకులు తీసుకున్న తర్వాత క్లాడియా ప్రైస్ అనే ఆవిడను 1949లో వివాహం చేసుకుంటాడు. 


ఉద్యోగాలు మరియు ఆవిష్కరణలు :


1906వ సంవత్సరంలో సాండర్స్  స్ట్రీట్ కార్ అనే కంపెనీలో కండక్టర్ గా పని చేస్తాడు. 
1907వ సంవత్సరంలో సాండర్స్  సథరన్ రైల్వేస్ వర్కుషాపులో హెల్పేర్ గా పని చేస్తాడు. 
1910 వ సంవత్సరంలో సాండర్స్ నార్ఫోక్ అండ్ వెస్ట్రెన్ రైల్వేస్ లో లేబర్ వర్క్ చేస్తాడు. 
1916వ సంవత్సరంలో సాండర్స్ ప్రేడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో సేల్స్ మాన్ గా చేస్తాడు. 
1922వ సంవత్సరంలో సాండర్స్ ఛాంబర్ అఫ్ కామర్స్ కంపెనీలో సెక్రెటరీ గా పని చేస్తాడు. 
1923వ సంవత్సరంలో సాండర్స్ మిచెలీన్ టైర్ కంపెనీలో సేల్స్ మాన్ గా పని చేస్తాడు. 
1924వ సంవత్సరంలో సాండర్స్ స్టాండర్డ్ ఆయిల్ అఫ్ కెంటకీ కంపెనీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తాడు.

1920వ సంవత్సరంలో సాండర్స్ ఫెర్రీ బోట్ అనే కంపెనీని స్థాపిస్తాడు. ఈ కంపెనీ చాలా గొప్ప సక్సెస్ అవుతుంది. అలా చిన్న వయసులోనే కంపెనీ షేర్ హోల్డర్ గా మారతాడు. ఆ కంపెనీలోని షేర్స్ ద్వారా సాండర్స్ కి 22000 ఆదాయం లభిస్తుంది. ఆ డబ్బులతో సాండర్స్ అసిటిలిన్ బల్బ్ అనే కంపెనీని స్థాపిస్తాడు. అయితే ఇది స్థాపించిన కొన్ని రోజులకే దివాళా తీస్తుంది.

కే.ఎఫ్.సి.(కెంటకీ ఫ్రైడ్ చికెన్ ) :


1939లో సాండర్స్ తన దగ్గర ఉన్న డబ్బులతో అశేవిల్లే అనే హోటల్ ని కొంటాడు. తను కొన్న అశేవిల్లే హోటల్లో ఫైర్ ఆక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత తన హోటల్ ని మళ్ళీ బాగుచేయించి 140 సీటర్ రెస్టారెంట్ గా మారుస్తాడు. ఆ హోటల్లో తను తయారు చేసిన సీక్రెట్ రెసిపీ అయిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ ని అమ్ముతాడు. అయితే కొన్ని రోజులకు గ్యాస్ కొరత ఏర్పడడంతో ఆ హోటల్ మూసేస్తాడు. అలా దివాళా తీసిన తన వ్యాపారాన్ని 1942లో అమ్మేస్తాడు. అయితే తను తయారు చేసిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ ని తన స్పెషల్ రెసిపీ గా భావించేవాడు. అలా 1952లో తన రెసిపీని బయటి హోటల్స్ లో అమ్మడానికి ఫ్రాంచేంజెస్ కోసం వెతుకుతాడు. అలా పెట్ హర్మాన్ అనే రెస్టారంట్ లో తన రెసిపీని అమ్మకానికి పెడతాడు. అయితే అది పెద్ద సక్సెస్ అవుతుంది. అప్పటి నుండి ఫ్రాంచేంజెస్ కోసం ఎన్నో కిలోమీటర్స్ ప్రయాణం చేసి పెద్ద పెద్ద హోటల్స్ లో తన రెసిపీని వాళ్ళ మేనుల్లోకి చేరుస్తాడు. అప్పటి నుండి సాండర్స్ వెనక్కి తిరిగి చుసుకున్నదే లేదు. ఎన్నో పెద్ద పెద్ద రెస్టారెంట్ లు ప్రాంచెంజి కోసం పోటీపడేవి. ఇలా వాళ్ళు అమ్మే ప్రతి చికెన్ పీస్ కి 0.04 డాలర్లను సాండర్స్ కు చెల్లిస్తారు. 1963 నాటికి కే.ఎఫ్.సి కంపెనీ  స్టోర్లు  600కు చేరుకుంటాయి. 1964వ సంవత్సరంలో సాండర్స్ తన కంపెనీని జాన్.వై.బ్రౌన్, జాక్.సి.మెస్సి కి 2 మిలియన్ డాలర్లకు అమ్మేస్తాడు.

మరణం :


సాండర్స్  1980వ సంవత్సరంలో అక్యూట్ లుక్కెమియా అనే రోగంతో మరణించాడు. 

9, నవంబర్ 2020, సోమవారం

బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) అంటే ఏమిటి?

బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక)




 ఒక ఊరిలో నరసింహుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన ఊరిలోని  పిల్లలకు ఉచితంగా విద్యను అభ్యసిస్తూ వాళ్ళను గొప్ప ప్రయోజకులుగా చేస్తాడు. అంతేకాకుండా అక్కడికి వచ్చే పిల్లలకు పుస్తకాలలోని పాఠాలే కాకుండా విజ్ఞాన పరమైన, ఆధ్యాత్మిక విషయాలను గురించి వాళ్లకు భోధించేవాడు. ఒక సారి నరసింహుడు అక్కడి పిల్లలకు విద్యను అభ్యసిస్తుండగా అక్కడికి ఒక బాలుడు వస్తాడు. ఆ బాలుడు బయటే నిలబడి గురువుగారు చెబుతున్న పాఠాలను వింటాడు. అలా బయటే నిలబడి గురువుగారు చెబుతున్న పాఠాలను వింటున్న ఆ బాలుడికి ఒక మాట మాత్రం చాలా సార్లు వినిపిస్తుంది. అదే బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) . ఆ మాటను విన్న ఆ బాలుడికి అసలు ఈ బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) అంటే ఏమిటి అనే సందేహం కలుగుతుంది. 

 

అలా కొంతసేపటికి గురువుగారు తన ఉపన్యాసాన్ని ముగించుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన గురువు గారు ఎంతో సేపటి నుండి అక్కడే ఉన్న ఆ బాలుడిని ఇలా అడుగుతాడు. బాబు నీకు ఏమి కావాలి నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావు అని అడుగుతారు. గురువుగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ బాలుడు నేను మీ దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చాను అని చెబుతాడు. ఆ మాటలు విన్న గురువుగారు ఆ బాలుడు తన కోసం చాలాసేపటి నుండి ఎదురుచూస్తుండడం ద్వారా తనలోని ఓర్పుని, వినమ్రతని చూసి తన శిష్యునిగా అంగీకరిస్తాడు. అప్పుడు ఆ బాలుడు, గురువుగారు తనని శిష్యునిగా స్వీకరించినందుకు సంతోషించి గురువుగారిని ఇలా అడుగుతాడు. గురువుగారు మీరు తరగతి గదిలో పాఠం చెబుతూ బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) అనే విషయం గురించి చెప్పారు. అసలు ఈ బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) అంటే ఏమిటి, దాని గురించి నాకు వివరించండి అని ఆ బాలుడు గురువుగారిని వినమ్రంగా అడుగుతాడు. అలా ఆ బాలుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు నాతో రా నీకు బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) అంటే ఏమిటో తెలియచేస్తాను అని తన వెంట తీసుకుని వెళ్తాడు. అలా గురువుగారు ఆ బాలుడుని ఒక సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. 

అప్పుడు ఆ బాలుడు గురువుగారిని నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకు వచ్చారు అని అడుగుతాడు. దానికి గురువు గారు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అని ఆ బాలుడుని సరస్సు లోనికి తీసుకొని వెళ్తాడు. అలా ఆ బాలుడుని సరస్సు లోపలికి తీసుకొని వెళ్లిన గురువు గారు అమాంతం నీటిలోనికి ముంచేస్తాడు. అలా గురువుగారు అమాంతం ఆ బాలుడుని నీటిలోనికి ముంచినప్పుడు ఆ బాలుడు గురువు గారు నన్ను ఆటపట్టించడానికి ముంచారు అని  అనుకుంటాడు. అలా 30 సెకన్లు గడుస్తుంది. అయిన గాని గురువు గారు ఆ బాలుడుని నీటిలో నుండి పైకి తీయడు. అప్పుడు ఆ బాలుడికి గురువు గారిపై తనను చంపాలని చూస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది.  అలా 60 సెకన్లు గడిచిపోతుంది. ఆ బాలుడికి ఊపిరి ఆడదు ఎలా అయిన పైకి లేవాలి అని బలంగా ప్రయత్నిస్తాడు. అప్పుడు గురువు గారు మరింత బలంగా ఆ బాలుడుని లోపలికి నెట్టుతాడు. అలా ఆ బాలుడు పైకి లేవాలని చూస్తే గురువుగారు లొపలికి నెట్టుతారు. అప్పుడు ఆ బాలుడు తనలో ఉన్న శక్తిని, బలాన్ని అంతా కూడగట్టుకుని బిగ్గరగా అరుస్తూ గురువుగారి చెయ్యను వదిలించుకుని పైకి లెగుస్తాడు. అలా నీటిలో నుండి పైకి లేచిన ఆ బాలుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనిపిస్తుంది.

 అప్పుడు ఆ బాలుడు కోపంతో, ఆవేశంతో తన ఎదురుగా ఉన్న గురువుగారిని తిట్టడం మొదలు పెడతాడు. ఆ బాలుడు ఎంత తిట్టినా కూడా గురువు గారు ఏ మాత్రం బాధ పడడు. మౌనంగా ఆ బాలుడి ఎదురుగా నిలబడి ఉంటాడు, అలా చాలా సేపు గురువుగారిని తిట్టి తిట్టి ఆ బాలుడు ఇక ఓపిక లేక పక్కనే ఉన్న చిన్న బండ రాయి పై కూర్చుంటాడు. కొంత సేపటికి ఆయాసంతో బండపై కూర్చున్న ఆ బాలుడి దగ్గరకు గురువుగారు వెళ్తాడు. ఆ బాలుడి దగ్గరకు వెళ్లిన గురువుగారు ఇలా అంటాడు. నేను నిన్ను నీటిలోపలికి ముంచిన మొదట్లో నీకు పెద్దగా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాని ఎప్పుడైతే నీకు ఊపిరి ఆడడం కష్టమైందో అప్పుడు నువ్వు పైకి లేవడానికి ప్రయత్నించావ్. 

జీవితం కూడా ఇంతే మనం మాములుగా అందరిలాగా బ్రతికేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. అంటే నువ్వు మొదట్లో నీటిలో ఉన్నప్పుడు నీకు కలిగిన పరిస్థితి మాదిరిగా ఉంటుంది. కాని ఎప్పుడైతే మనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, ఆ లక్ష్య ఛేదనలో సాగే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మనం మన లక్ష్యాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ బలంగా నిలబడి మనల్ని మనం విజేతలుగా మార్చుకోవడమనేది, అంటే ఇక చనిపోతున్నానేమో అని నువ్వు నీటిలో నుండి బలంగా బయటకి వచ్చినట్టి పరిస్థితి మాదిరిగా ఉంటుంది. అలా మన లక్ష్య సాధనలో మనం బలంగా నిలబడడానికి మనకు శక్తిని, బలాన్ని ఇచ్చేది మనలో ఉన్న బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) అని అంటారు. అలా గురువు గారు ఆ బాలుడికి బర్నింగ్ డిజైర్ (రగిలే కోరిక) గురించి తెలియచేస్తాడు.

6, నవంబర్ 2020, శుక్రవారం

ఉద్రేకంగా మరియు ధైర్యంగా ఉండండి. ఎల్లప్పుడూ నేర్చుకోవడం కొనసాగించండి. మీరు నేర్చుకోకపోతే ఉపయోగకరమైన పనులు చేయడం మానేస్తారు.

 సత్య నాదెళ్ల 


పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటుంటారు. ఇంట గెలిచి కాదు రచ్చ గెలిచి చూడు అని. మన ఇంట్లో నాలుగు గోడల మధ్య మనం గెలిచి గొప్పవాళ్ళం అని అనిపించుకోవడం కాదు, బయట సమాజంలోకి వెళ్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గొప్పవాడిని అని అనిపించుకోవడం నిజమైన గెలుపు అని అంటారు. చాలా మంది తమని తాము గొప్పవాళ్ళ గాను సమర్థులుగాను చూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కాని కొంత మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అటువంటి వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి, భారతీయుడు, 
మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క ప్రధాన కార్య నిర్వాహక అధికారి సత్య నాదెళ్ల. 

                 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


సత్య నాదెళ్ల అసలు పేరు సత్యనారాయణ నాదెళ్ల. సత్య నాదెళ్ల 19 ఆగష్టు 1967న ఆంధ్రప్రదేశ్ లోని (ఇప్పుడు తెలంగాణా)హైదరాబాద్ నగరంలో జన్మించాడు. ఇతను యుగంధర్, ప్రభావతి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సత్య తన చదువును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేసాడు. మరియు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అనే విద్యా సంస్థలో బ్యాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ పట్టాను పొందాడు. సత్య తన మాస్టర్ అఫ్ సైన్స్ డిగ్రీని యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ లో పొందాడు. అంతే కాకుండా యూనివర్సిటీ అఫ్ చికాగోలో తన ఎంబీఏ డిగ్రీని కూడా పొందాడు. 


వ్యక్తిగత విషయాలు : 


సత్య 1992లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. సత్య చిన్నప్పటి నుండి క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడేవాడు. సత్య ఎక్కువగా ఇండియన్ పోయెట్రీ బుక్స్ , అమెరికన్ పోయెట్రీ బుక్స్ ని చదువుతాడు. సత్య సీతల్ సోకర్స్ క్లబ్ కు ఒక యజమానిగా వ్యవహరిస్తున్నాడు. సత్య హిట్ రిఫ్రెష్ అనే బుక్ ని రాసాడు. ఈ బుక్ ద్వారా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు దానంగా ఇచ్చేసాడు. 

సత్య మొదట్లో సన్ మైక్రోసిస్టమ్స్ అనే కంపెనీలో పనిచేసేవాడు. 

మైక్రోసాఫ్ట్ :


సత్య 1992వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో పని చేసేవాడు. ఆ తర్వాత సత్య మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవలప్మెంట్ టీంకి వైస్ ప్రెసిడెంట్ గా  వ్యవహరించాడు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ సర్వర్, డెవలపర్ టూల్స్ యొక్క ఉన్నతిలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలా 2011లో 16 బిలియన్ డాలర్లు ఉన్న క్లౌడ్ సర్వీసెస్ ఆదాయాన్ని 20 బిలియన్ డాలర్లకు చేరువయ్యేలా చేసాడు. తద్వారా 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడు. అలా మైక్రోసాఫ్ట్ ను ప్రముఖ దిగ్గజ కంపెనీలకు ఏ మాత్రం తగ్గకుండా బలంగా నిలబెట్టాడు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా మోజంగ్, మైన్ క్రాఫ్ట్, క్సమరిన్ లాంటి కంపెనీలను కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు. అంతేకాకుండా లింకేడిన్ కంపెనీని 26 బిలియన్లకు కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు.   

ఇలా మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఎంతో గొప్ప పేరు సంపాదించిన సత్య, సి.ఎన్.బి.సి నిర్వహించిన వ్యాపార దిగ్గజాలకు ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఐకాన్ గా నిలిచాడు.

3, నవంబర్ 2020, మంగళవారం

పెట్టుబడి యొక్క ప్రాథమిక ఆలోచనలు స్టాక్‌లను వ్యాపారంగా చూడటం, మార్కెట్ యొక్క హెచ్చుతగ్గులను మీ ప్రయోజనం కోసం ఉపయోగించడం మరియు భద్రత యొక్క మార్జిన్‌ను పొందడం

వారెన్ బఫెట్


డబ్బు, డబ్బు, డబ్బు ! మనిషి జీవితంలో తరతరాలుగా డబ్బు అనే అంశం ఒక ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అటువంటి ఈ డబ్బును సంపాదించడానికి ఎంతో కష్టపడాలి, శ్రమపడాలి. లేనివాడి కడుపు నింపుకోవడానికి కావాల్సింది డబ్బే, ఉన్నవాడి గౌరవాన్ని పెంచడానికి కావాల్సింది డబ్బే. అటువంటి ఈ డబ్బుపై ఎనలేని ఆసక్తిని, ప్రేమని కలిగివుండి, చిన్నప్పటి నుండి డబ్బును సంపాదిస్తూ, తను మొదలుపెట్టిన పనులలో గొప్పగా విజయం సాధిస్తూ, వ్యాపారాలలోను, 
పెట్టుబడుల విషయంలోనూ తనదైన ముద్రను వేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది జీవితాలకు మంచి దారిని చూపిన వ్యక్తి, వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి,
బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ ఛైర్మన్ వారెన్ బఫెట్.

 

వారెన్ బఫెట్ అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. బఫెట్ నెబ్రాస్కాలోని  ఒమాహ అనే నగరంలో జన్మించాడు. బఫెట్ చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. అలా అతను ఏడేళ్ల వయసులో చదివిన వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు అనే పుస్తకం ద్వారా అతను డబ్బుపై ఇష్టాన్నిపెంచుకున్నాడు. అలా డబ్బు సంపాదించడం కోసం కోకా-కోలా బాటిల్స్ అమ్మడం, చూయింగ్ గమ్స్ అమ్మడం, న్యూస్ మాగజైన్ వేయడం వంటివి చేసేవాడు. అంతే కాకుండా తన తాత గారి నగల దుకాణంలో కూడా పని చేసేవాడు. అలా తన పదకొండేళ్ల వయసులో తన సోదరి డోరిస్ బఫెట్ తో కలిసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఉన్న సిటీస్ సర్వీస్ లో షేర్స్ కొంటాడు. బఫెట్ కొన్ని రోజులకు తను దాచుకున్న డబ్బుతో పొలాన్ని కొనుకుంటాడు. బఫెట్ 14 ఏళ్ళ వయసులో తన మొదటి ఇన్ కమ్ టాక్స్ కట్టాడు. బఫెట్ కొలంబియా బిజినెస్ స్కూల్లో తన బిజినెస్ డిగ్రీని పొందాడు. 

బెంజిమెన్ గ్రాహం రాసిన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే బుక్ ద్వారా బఫెట్ వేల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత 1951 నుండి 1954 వరకు బఫెట్ ఫాల్క్ కంపెనీలో పెట్టుబడుల సేల్స్ మాన్ గా పని చేస్తాడు. తర్వాత 1954 నుండి 1956 వరకు గ్రాహం న్యూమాన్ కార్పొరేషన్ లో సెక్యూరిటీ అనలిస్ట్ గా చేస్తాడు. తర్వాత 1956 నుండి 1969 వరకు తను స్థాపించిన బఫెట్ పార్టనర్ షిప్ కి జనరల్ పార్టనర్ గా వ్యవహరించాడు. అలా 1970లో బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీని స్థాపించి దానికి ఛైర్మన్, వ్యవహారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ 1962లో తన పార్టనర్ షిప్ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతో మిలియనీర్ గా మారాడు. 

బఫెట్ ఎప్పుడు అప్పుచేసి బిజినెస్ చేయకూడదు అని అంటాడు. ఎప్పుడు కూడా బఫెట్  ఇన్వెస్టుమెంట్ విషయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే సూత్రాన్ని పాటిస్తాడు. అందుకే స్టాక్ మార్కెట్లో రేట్లు ఎక్కువగా ఉంటే బఫెట్ తక్కువ స్టాక్స్ కొంటాడు. తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్స్ కొంటాడు. అంతే కాకుండా బఫెట్ ఏదైనా కొత్త వ్యాపారం చెయ్యాలనుకుంటే ఒకటి నుండి రెండు పుస్తకాలు చదివిన తర్వాతే తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. అలా అమెరికాలో మూతపడే కంపెనీలను కొని వాటిని పెద్ద కంపెనీలుగా మార్చేస్తాడు. అలా తను తన పార్టనర్ చార్లీ మంగర్ తో కలిసి  కొన్న A గ్రేడ్ షేర్స్ ద్వారా బఫెట్ బిలియనీర్ గా ఎదిగాడు. 

1988లో కోకా-కోలా కంపెనీ 7 శాతం వాటాను 1.02 బిలియన్లకు కొనడం ద్వారా  బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ అతిపెద్ద కంపెనీల జాబితాలో చేరింది. ఇప్పటికి కూడా కోకా-కోలా కంపెనీలో బెర్క్‌షైర్‌ హాత్‌వే షేర్ హోల్డర్ గా కొనసాగుతుంది. అంతే కాకుండా ఆపిల్, ఐబీఎం లాంటి టెక్నాలజీ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా బఫెట్ తన ముందు చూపును ప్రదర్శించాడు. 2020 నాటికి  బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ క్రాఫ్ట్ హెయిన్జ్ కంపెనీలో 26.7 శాతం, అమెరికన్ ఎక్సప్రెస్స్ కంపెనీలో 17.6 శాతం, వెల్స్ ఫోర్గ్ కంపెనీలో 9.9 శాతం, కోకా-కోలా కంపెనీలో 9.32 శాతం, బ్యాంక్ అఫ్ అమెరికా కంపెనీలో 11.5 శాతం, ఆపిల్ కంపెనీలో 5.4 శాతం వాటాలను కలిగి ఉంది. 

బఫెట్ 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో 62 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచాడు. 2010లో గివింగ్ ప్లెడ్జ్ ద్వారా బఫెట్, బిల్ గేట్స్, మార్క్  జూకర్ బర్గ్ తమ ఆదాయంలో 50 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రమాణం చేసారు. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...