30, డిసెంబర్ 2020, బుధవారం

ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు తింటూ చర్మసౌందర్యాన్ని కాపాడుకుందాం.

మగువకు అలంకారం చర్మ సౌందర్యం 


రోజువారి జీవన విధానాలు, దుమ్ము, కాలుష్యం, ఆహార అలవాట్లు మన చర్మాన్ని , జుట్టును ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మన అలవాట్లు సక్రమంగా లేకపోతే మనం చిన్న వయసులోనే ముసలిగా కనిపించడం, ముఖం నీరసంగా ఉండడం లాంటివి జరుగుతాయి. ఆరోగ్యకరమైన ఆహారపు విధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా మన చర్మం ఎక్కువ కాలం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి మన చర్మం ముడతలను దాచుకోవడం కోసం మేకప్ బాక్స్ వైపు చూడడం కాకుండా మనం తినే ఆహారపదార్ధాల వైపు చూద్దాం. 


మన చర్మ సౌందర్యాన్ని పెంచే కొన్ని ఆహారపదార్థాలను గురించి తెలుసుకుందాం.


డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలు


బాదం, వాల్ నట్స్ , విత్తనాలలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మం మృదువుగాను, సౌందర్యవంతంగాను ఉండడానికి సహకరిస్తాయి. 
 

ప్రోటీన్


శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే చర్మం పొడి బారిపోవడం, జుట్టు పలచబడడం లాంటివి జరుగుతాయి. ప్రోటీన్స్ ఎక్కువగా గుడ్లు, పాలు, ధాన్యాలలో ఉంటాయి. జుట్టు లో కెరటిన్ అనే పోషకం ఉంటుంది. ఈ పోషకం అనేది జుట్టుకు సరిగ్గా అందనపుడు జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. మనం ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నియంత్రించవచ్చు.
  

విటమిన్-సి


విటమిన్-సి చర్మం కాంతివంతంగా ఉండడానికి, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బ తీసే బ్యాక్టీరియా లను నాశనం చేస్తాయి. తద్వారా చర్మం తొందరగా ముడతలు పడడం మరియు చిన్న వయసులోనే జుట్టు మెరిసిపోవడాన్ని నియంత్రిస్తుంది. 

విటమిన్-ఏ


చర్మం నిగారిస్తూ, కాంతివంతంగా ఉండడానికి విటమిన్-ఏ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్-ఏ ఎక్కువగా క్యారెట్, గుమ్మడి, మామిడి, బొప్పాయి లలో ఉంటుంది. అంతేకాకుండా విటమిన్-ఏ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి కరోనా లాంటి రోగాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
 

పెరుగు


పెరుగు మంచి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ను కలిగి ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన మరియు ఎటువంటి మచ్చలు లేని చర్మాన్ని పొందవచ్చు. పెరుగు మన జుట్టు ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

24, డిసెంబర్ 2020, గురువారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మీ బరువును సునాయాసంగా తగ్గించుకోండి.

ఆరోగ్యకరంగా బరువును తగ్గించుకుందాం.


ఈ రోజుల్లో యువకుల నుండి పెద్దవారి వరకు అధికమైన శరీర బరువు అనేది ప్రధాన సమస్యగా మారింది. మనం లావుగా ఉంటే మనల్ని చూసి ఎంతో మంది హేళన చేస్తారు. బండి మీద మనం తప్పించి వేరేవారు కూర్చోవడానికి అవకాశం ఉండదు. సరిగ్గా పరిగెత్తలేము. ఏదైనా పనిని కొంచెం సేపు చేస్తే ఆయాసం వచ్చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో గ్యాస్ పెరిగిపోయి తేన్పులు రావడం, కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా కాకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. బరువు పెరగడం వల్ల ఇటువంటివే కాకుండా ఇంకా మరెన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం మన శరీర బరువును సమానంగా ఉంచుకుంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.


మన బరువును సమానంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరంగా ఉండే కొన్ని విధానాలను తెలుసుకుందాం.


1) సమయానికి ఆహారం తీసుకోవడం. 

2) కాయగూరలు,ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం. 

3) మంచి నీటిని తరచుగా తాగడం. 

4) కొవ్వు పదార్ధాలైన స్వీట్స్, నెయ్యి లాంటి ఆహారపదార్ధాలను తక్కువగా తినడం. 

5) ఆయిల్ ద్వారా తయారయ్యే వస్తువులైన ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీస్, బజ్జిలు లాంటి వాటిని తినకపోవడం. 

6) ఉదయం టిఫిన్ గా మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం. 

7) మధ్యాహ్నం భోజన సమయంలో కొరలు లేదా దంపుడు బియ్యం ద్వారా వండిన ఆహారాన్ని తీసుకోవడం. 

8) రాత్రి భోజన సమయంలో రెండు చపాతీలు తినడం. 

9) మధ్యలో ఆకలి వేస్తే పండ్లను తినడం. 

10) రాగి జావను తాగడం.

11) క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామాలు చేయడం  

ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని, బరువును సక్రమంగా ఉంచుకోండి.  

 

21, డిసెంబర్ 2020, సోమవారం

మంచు గడ్డల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మంచు(snow )


వేసవి కాలంలో భానుడి ప్రతాపం నుండి తట్టుకోవడానికి ప్రజలు ఎక్కువగా చల్లటి ప్రదేశాలకు వెళ్తారు. అయితే యూరోపియాన్ ప్రాంతాలు వేసవి కాలంలో కూడా చల్లదనాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల పర్యాటకులు ఈ ప్రాంతాలకు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ శీతోష్ణ ప్రాంతాలలో మనకు ఎక్కువగా కనిపించేవి మంచు గడ్డలు. మంచుగడ్డలు మేఘాల నుండి భూమి పైకి రాలతాయి. అంతేకాకుండా ఈ మంచు గడ్డలు ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. మంచు గడ్డల చల్లదనం వల్ల మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ప్రాంతాల ప్రజలు స్వేట్టర్ లను, దుప్పట్లను ఎక్కువగా వాడతారు. 
 


మంచు గురించి అక్కడి ప్రదేశం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


1) వాతావరణంలోని మంచు బిందువులు మేఘాలలోకి ఒక్కొక్కటిగా చేరి మంచు గడ్డలుగా మారతాయి. ఆ మంచు గడ్డలు మేఘాల నుండి భూమిపై పడతాయి.
 
2) శాస్త్రవేత్తల పరిశోధనలో ఏ రెండు మంచు గడ్డలు ఒకేలాగా ఉండవు అని తేలింది. కాని 1988 లో మాత్రం ఒక శాస్త్రవేత్త తనకు రెండు ఒకేలా ఉన్న మంచు గడ్డలు దొరికాయి అని అన్నారు.

3) ఈ మంచుగడ్డలలో అతిపెద్ద మంచుగడ్డ ఎత్తు 15 అంగుళాలు అని వెల్లడించారు. 

4) సహజంగా ఈ మంచు గడ్డ రంగులేని అపారదర్శక వస్తువు. ఇది అద్దం లాంటిది. దీని నుండి కాంతి చొచ్చుకుని పోలేదు.

5) యునైటెడ్ స్టేట్స్ లో శీతాకాలం సమయంలో ఒక స్టెఫిలియన్ ( ఒక స్టెఫిలియాన్ 24 సున్నాలను కలిగి ఉంటుంది)  మంచు స్పటికాలు ఆకాశంలోని మేఘాల నుండి వెలువడతాయి.

6) మాములుగా అమెరికాలో 24 గంటల పాటు పడే మంచు 75.8 అంగుళాలుగా ఉంది. అయితే 1921లో మాత్రం ఆరు అడుగుల మంచు కురిసింది.

7) మంచు ద్వారా తయారు చేయబడ్డ ఇళ్లను ఇగ్లూస్ అంటారు. ఇవి మనిషి యొక్కఉష్ణాన్ని తీసుకుని వేడిగా మారతాయి. మంచుతో కట్టినవైనా గాని వీటి లోపల వేడిగా ఉంటుంది. 

8) నోవా స్కోటియా, నార్త్ డకోటా, ఉత్తర డకోటా ప్రజలు మంచు దేవతలను తయారు చేసి రికార్డులను సృష్టించారు. 

9) సీతల్ ప్రాంతంలో అతిపెద్ద మంచు యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధానికి రెండు బ్యారేజ్ లు అడ్డువస్తున్నాయని 5834 మంచు యోధులు వాటిని తొలగించారు.  

18, డిసెంబర్ 2020, శుక్రవారం

ఎనిమిది మెదడులు, మూడు గుండెలు, నీలి రక్తం కలిగిన జీవి.

సముద్రపు జీవి ఆక్టోపస్


సముద్రపు అడుగున ఉంటూ ఎన్నో జీవరాశులను తన చేతులతో పట్టి తినే ప్రమాదకరమైన జీవరాశి ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ మూడు గుండెలు, తొమ్మిది మెదడులను కలిగి ఉంటుంది, మరియు దీని యొక్క రక్తం నీలి రంగులో ఉంటుంది. ఆక్టోపస్ యొక్క తొమ్మిది మెదడులలో ఒకటి న్యూరాన్లతో ముడిపడి ఉంటుంది. మరియు మిగతా ఎనిమిది మెదడులు ఎనిమిది చేతులతో అనుసంధానం అయ్యి ఉంటాయి. ఇది శరీరంలో ఎటువంటి ఎముకలు లేని జీవి. ఈ జీవి  ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని తింటుంది. అంతే కాకుండా ఇది సముద్రపు 
జీవరాసులలో తెలివైన జీవరాశిగా పేరు గడించింది. 


ఆక్టోపస్, ఆక్టోపోడా అనే జాతికి చెందిన జీవి. ఈ ఆక్టోపోడా జాతిలో ఇంకా ఇదే తరహాలో 300 జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆక్టోపస్ అనే పదం గ్రీకు భాష నుండి పుట్టింది. గ్రీకు భాషలో ఆక్టోపస్ అంటే ఎనిమిది అడుగులు అని అర్ధం. ఒక మ్యాగజిన్ వారు ఆక్టోపస్ ను "సముద్రంలో అత్యంత రహస్యమైన జీవిగా పరిగణించారు". ఆక్టోపస్ జాతిలో పసిఫిక్ ఆక్టోపస్ అతిపెద్ద ఆక్టోపస్ గా పేర్కొనబడుతుంది. సాధారణంగా పెద్ద ఆక్టోపస్ బరువు పదిహేను కేజీలు ఉంటుంది. వీటిలోని అతిపెద్ద ఆక్టోపస్ యొక్క బరువు సుమారు 71 కేజీల వరకు ఉంటుంది. ఈ ఆక్టోపస్ కు ఎముకలు లేకపోవడం వల్ల ఇది దీని చేతులను ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పగలదు. అంతేకాకుండా ఏ దిశలోనైనా వొంగగలుగుతుంది. దీని చర్మం బాహ్యకణాలు, ఇంద్రియ కణాలతో నిండి ఉంటుంది. 

ఆక్టోపస్ కు మూడు గుండెలు ఉంటాయి. ఒక గుండె రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. మరియు మిగతా రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. దీని యొక్క రక్తం నీలి రంగులో ఉండడానికి కారణం హేమోసైనిన్ అనే రాగి ఆధారిత ప్రోటీన్ దీని శరీరంలో ఉండడం. ఆక్టోపస్ ఈత కొట్టినప్పుడు రక్తాన్ని సరఫరా చేసే అవయవం కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకే ఇవి ఈత కొట్టడం కంటే నెమ్మదిగా అటు ఇటు వెళ్ళడానికి ఇష్టపడతాయి. ఆక్టోపస్ లు ప్రపంచ మహా సముద్రాలలో నివసిస్తాయి. ఇవి సముద్రంలోని దిబ్బలు,పగుళ్లలో నివసిస్తాయి. కొన్ని ఆక్టోపస్ సముద్రపు గుహలలో నివసిస్తాయి. 

ఆక్టోపస్ లు ఏకాంతంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు  ఇతర ఆక్టోపస్ లతో  కలుస్తాయి. సాధారణంగా ఆక్టోపస్ లు రాత్రిపూట ఆహారం కోసం వేటాడతాయి. కొన్ని సాయంత్రం, మరికొన్ని వేకువజామున వేటాడతాయి. పగటిపూట ఇవి వేటాడవు. 

జీవరాసులు ఏవైనా దీనిపై దాడి చేయడానికి వస్తే ఇది ముందుగానే పసిగడుతుంది. ఆ సమయంలో ఇది ఆ జీవరాశిపై సిరా అనే ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రావణం తాత్కాలికంగా అంధకారున్ని చేయడమే కాకుండా గందరగోళానికి గురిచేస్తుంది. ఒకొక్క సారి ఈ సిరా వల్ల రుచి మరియు వాసన కూడా మందగిస్తుంది. 

ఆక్టోపస్ సహజంగా మాంసాహారి . ఇది ఎక్కువగా చేపలు, సొర చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు  తింటుంది. ఆక్టోపస్ ముందుగా తన శరీరంతో పూర్తిగా తను తినే ఆహారంపై పడుతుంది, అక్కడి నుండి మెల్లగా నోటిలో వేసుకుని తింటుంది. 

15, డిసెంబర్ 2020, మంగళవారం

కోసినప్పుడు కన్నీళ్లు పెట్టించినా తిన్నప్పుడు మాత్రం దీని రుచితో ఔరా అనిపిస్తుంది.

కూరగాయాలకు రారాజు ఉల్లిపాయ


ఎటువంటి వంటలోనైనా ఇది లేకుంటే ఆ వంటకు రుచే వుండదు. ప్రొద్దుటే చేసుకునే టిఫిన్ నుండి సాయంత్రం భోజనం వరకు ఇది లేకుంటే చాలా కష్టం. కూర ఏదైనా సరే దాని రుచిని పెంచడానికి దీనిని వాడవలసిందే. భోజనప్రియులను అకట్టుకోవడానికి దీనిని మన వంటలలో వాడాల్సిందే. ఎన్నో పోషక విలువలు కలిగియున్న ఎంతోమందితో ఔరా అనిపించుకున్న మన వంటింటి నేస్తం ఉల్లిపాయ. 
   

ఉల్లిపాయ యొక్క శాస్త్రీయ నామం ఆలియం సీపా, మరియు ఇది ఆలియేసి కుటుంబంలో ఆలియం ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను తెలుగులో ఉల్లిగడ్డ అని కూడా అంటారు. ఉల్లిపాయను ఇంగ్లీషులో ఆనియన్ అని పిలుస్తారు. ఈ ఉల్లిపాయను ఎక్కువగా ప్రతిరోజు వండుకునే వంటలలోను, విందు భోజనాలలోను ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ఉల్లిపాయలు తెల్ల, ఎర్ర రంగులలో ఉంటాయి. మరియు చిన్న, పెద్ద ఆకారాలలో లభిస్తాయి. అంతేకాకుండా ఎక్కువ వాసన, తక్కువ వాసన మరియు తియ్యగా ఉన్న ఉల్లిపాయలు కూడా మనకు లభిస్తాయి.

ఉల్లిపాయకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉల్లిపాయ భారతదేశంలో పుట్టింది అని కొందరు అంటే, ఇంకొంత మంది పాకిస్తాన్ లో పుట్టింది అని అంటారు. అయితే మొదట్లో ఆసియా లో మాత్రమే పండే ఈ పంటను ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా పండిస్తున్నారు. ఉల్లిలో క్యాలరీ శక్తి ఎక్కువ, వేయిస్తే ఈ శక్తి ఇంకా పెరుగుతుంది. ఉల్లిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని కోసేటప్పుడు కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. అంతేకాకుండా ఉల్లిని ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయలతో చేసే కూర చాలా మంచి రుచిని కలిగిఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయల రసాన్ని తలపై రాయడం ద్వారా జుట్టు ఎదుగుదలను పెంచుకోవచ్చు.  


ఉల్లిపాయల నుండి వచ్చే ఉల్లికాడలు ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి. ఉల్లికాడలను వేడి నీళ్లలో మగ్గించడం ద్వారా వచ్చే రసం మన జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉల్లికాడలను వారి వంటలలో వినియోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఉల్లి కాడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లి కాడలలో విటమిన్ సి, బీటాకెరెటిన్ లు ఉంటాయి ఇవి మన కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం ద్వారా పుట్టబోయే బిడ్డకు వెన్నుముక సమస్యలు తలెత్తకుండా చేయగలుగుతారు. 

12, డిసెంబర్ 2020, శనివారం

ఈ నిమిషాన్ని ఆనందంగా గడుపుదాం.

ఈ నిమిషాన్ని ఆనందంగా గడుపుదాం.



ఒక ఊరిలో ఇద్దరు బౌద్ధ సన్యాసులు తమ  యొక్క బిక్షాటనను చేస్తుంటారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లిద్దరిలో ఒకరు సీనియర్ సన్యాసి ఇంకొకరు జూనియర్ సన్యాసి. ఆ క్రమంలో వాళ్లిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న మార్గంలో ఒక సరస్సు వస్తుంది. అయితే అక్కడ ఒక యువతి నీటిని చూసి భయపడుతూ సరస్సును దాటకుండా అక్కడే ఉండిపోతుంది. అలా భయంతో అక్కడి సరస్సు దగ్గర ఉన్న ఆమెను పట్టించుకోకుండా జూనియర్ సన్యాసి ఆ సరస్సును దాటి వేరే వైపుకు వెళ్ళిపోతాడు.


 


ఆ తర్వాత అక్కడే ఉన్న సీనియర్ సన్యాసి తనతో పాటు ఆ యువతిని కూడా తీసుకుని వెళ్లి సరస్సును దాటుతాడు. అలా అతను సరస్సును దాటి ఆ యువతిని వేరే పక్కన వదిలేసి తనతో పాటు వచ్చిన జూనియర్ సన్యాసితో కలిసి తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. వాళ్లిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే జూనియర్ సన్యాసి అదే పనిగా సీనియర్ సన్యాసిని చూసుకుంటూ ముందుకు నడుస్తాడు. 

అలా కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ జూనియర్ సన్యాసి, సీనియర్ సన్యాసిని ఇలా అడుగుతాడు. మన ధర్మం ప్రకారం ఆడవాళ్లను ముట్టుకోవడం అనేది నిషిద్ధం కదా మరి మీరెందుకు ఆమెను ముట్టుకున్నారు అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ సీనియర్ సన్యాసి ఇలా అంటాడు. నేను ఆమెను సరస్సు దాటించి అక్కడ వదిలిపెట్టి వచ్చి చాలా సేపు అయ్యింది. 

అయినా గాని నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నావ్. అలా ఎప్పుడో అయిపోయిన విషయం గురించి ఎందుకు ఆలోచించుకుంటూ ముందుకు సాగుతావు. ప్రస్తుతం గురించి ఆలోచించుకుంటూ ముందుకు సాగు అని అంటాడు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేస్తే ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ మనశ్శాంతిని దూరం చేసుకుంటాం. 

అలా జరిగిపోయిన విషయాలన్నింటిని గుర్తుకు తెచ్చుకుని ఇలా చేయకుంటే బాగుండును కదా లేదంటే అలా చేయకుంటే బాగుండును కదా అని అదే పనిగా మన జీవితమంతా వాటిని గురించే ఆలోచిస్తూ బ్రతికేస్తుంటాం. ఆ విధంగా మన ప్రస్తుత జీవితాన్ని నాశనం చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడో అయిపోయిన విషయాలను గురించి ఆలోచించే  శైలిని పోగొట్టుకుని ప్రస్తుత జీవితాన్ని ఆనందంగా గడిపే ఆలోచనాశైలిని అలవరుచుకుందాం. తద్వారా జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. 

11, డిసెంబర్ 2020, శుక్రవారం

కాలంతో సంబంధం లేని ఆనందం.

కాలంతో సంబంధం లేని ఆనందం



ఒక ఊరిలో రాణి అనే ఆమె ఉండేది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించి ఏడుస్తూ ఉండేది. అలా ఎప్పుడు చూసిన ఏడుస్తూ ఉండే ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు ఏడుపురాణి అని పేరుపెడతారు. అయితే ఆ ఊరిలో ఒక వ్యక్తి మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ఏడవడానికి గల కారణాన్ని అడుగుతాడు. అప్పుడు ఆమె అతనితో తన బాధకు గల కారణాన్ని చెబుతుంది. నాకు ఇద్దరు కూతుళ్లు. అయితే నా పెద్దకూతురి మొగుడు ఫ్యాన్స్ , కూలర్లు, ఏసీలు అమ్మే వ్యాపారం చేస్తాడు. అందువల్ల అతని వ్యాపారం వేసవికాలంలో చాలా బాగా జరుగుతుంది.


 


అయితే శీతాకాలంలో అతని వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అని బాధ కలిగి ఏడుస్తాను. ఇంక నా రెండవ కూతురి మొగుడు శీతాకాలంలో వేసుకునే స్వేట్టర్స్, దుప్పట్ల వ్యాపారం చేస్తాడు. అందువల్ల అతని వ్యాపారం శీతాకాలంలో చాలా బాగా జరుగుతుంది. అయితే వేసవికాలంలో అతని వ్యాపారం సరిగ్గా జరగట్లేదని బాధ కలిగి ఏడుస్తాను. అని ఆమె బాధకు గల కారణాన్ని అతనికి చెబుతుంది. అలా ఆమె చెప్పిన విషయాన్ని విన్న ఆ వ్యక్తి ఆమెతో ఇలా అంటాడు. నాకు తెలిసిన గురూజీ ఒక ఆయన ఉన్నారు. 

ఆయన దగ్గరకు మీరు వెళ్తే అతను మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెబుతాడు అని అంటాడు. అది విన్న ఆమె వెంటనే అతని దగ్గరకు బయలుదేరుతుంది. అలా అతని దగ్గరకు వెళ్లి ఆమె తన బాధకు గల కారణాన్ని అతనికి వివరిస్తుంది. అది విన్న ఆ గురూజీ ఆమెకు ఒక సలహా ఇస్తాడు. మీ పెద్ద కూతురి వ్యాపారం వేసవికాలంలో మంచిగా నడుస్తుంది కాబట్టి శీతాకాలంలో జరిగే మీ చిన్న కూతురి వ్యాపారం గురించి ఆలోచించడం మానేయండి. 

అలానే మీ చిన్న కూతురి వ్యాపారం శీతాకాలంలో బాగుటుంది కాబట్టి వేసవికాలంలో జరిగే మీ పెద్ద కూతురి వ్యాపారం గురించి ఆలోచించడం మానేయండి మీకు ఎటువంటి బాధ ఉండదు అని ఆమెకు చెబుతాడు. అది విన్న ఆమె వేసవికాలంలో చిన్న కూతురి వ్యాపారం గురించి, శీతాకాలంలో పెద్ద కూతురి వ్యాపారం గురించి ఆలోచించడం మానేస్తుంది. అలా ఆమె చేయడం ద్వారా అప్పటి నుండి ఎటువంటి బాధ లేకుండా అనందంగా నవ్వుతూ జీవితాన్ని గడుపుతుంది. 

అలా నవ్వుతూ ఉండే ఆమెను చూసిన ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను నవ్వుల రాణి అని పిలవడం మొదలుపెడతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మన జీవితంలో ఆనందం, బాధ అనే రెండు ఉంటాయి. కాబట్టి మనం ఏదో ఒక విషయం గురించి మాత్రమే ఆలోచిస్తూ జీవితాన్ని బ్రతకడం అనేది మంచి పద్ధతి కాదు.    

10, డిసెంబర్ 2020, గురువారం

సీతాకోకచిలుక కథ



సీతాకోకచిలుక కథ
 



ఒక రోజు రాజు అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి అడవికి వెళ్తాడు. అలా అడవికి వెళ్లిన అతనికి ఒక చిన్న గూడు కనిపిస్తుంది. ఆ గూడు నుండి ఒక సీతాకోకచిలుక బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అలా ఆ సీతాకోకచిలుక గూడు నుండి బయటకు రావడానికి ఎంతోసేపు ప్రయత్నించి, ప్రయత్నించి ఇంక శక్తి లేక ఆగిపోతుంది. ఆ విధంగా అక్కడ జరుగుతున్నదంతా దూరం నుండి గమనిస్తున్న ఆ వ్యక్తి సీతాకోకచిలుకకు సహాయం చేయాలనుకుంటాడు. అతను వెంటనే సీతాకోకచిలుక దగ్గరకు వెళ్లి దాని గూడును తొలగిస్తాడు. అలా అతను ఆ గూడును తొలగించిన వెంటనే ఆ సీతాకోకచిలుక చాలా సులువుగా బయటకి వచ్చేస్తుంది.


 


అయితే బయటకు వచ్చిన సీతాకోకచిలుక యొక్క రెక్కలు, శరీరం సక్రమంగా తయారుకావు, దాని వల్ల అన్ని సీతాకోకచిలుకలలా పైకి ఎగరలేకపోతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే సీతాకోకచిలుక గొంగళి నుండి సీతాకోకచిలుకగా మారే క్రమంలో ఒక గూడును కట్టుకుని అందులో నివాసం ఉంటుంది. ఆ విధంగా గూడులో కొన్ని రోజుల పాటు నివాసం ఉన్న ఆ గొంగళి క్రమక్రమంగా సీతాకోకచిలుక రూపంలోకి మారిపోతుంది. అలా సీతాకోకచిలుకగా మారిన గొంగళికి రెక్కలు, శరీరాకృతి రాకుండానే బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. 

అలా ఆ సీతాకోకచిలుక బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దాని యొక్క శరీరం, రెక్కలు  ఏర్పడి పూర్తి సీతాకోకచిలుకగా మారి దాని గూడును వదిలించుకుని బయటకి వస్తుంది. అయితే ఇది తెలియని ఆ వ్యక్తి ఆ సీతాకోకచిలుక బయటకు రావడానికి ఇబ్బంది పడుతుందని దానికి సహాయం చేస్తాడు. అతను చేసినది మంచి పని అయినా ఆ సీతాకోకచిలుకకు పూర్తిగా రెక్కలు, శరీరాకృతి రాకపోవడం వల్ల దాని జీవితకాలమంతా ఎగరకుండానే ఉండిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఎదుటివారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలని ఉంటుంది. 

అలా మనం చేసే సాయం వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడితే మంచిదే. కాని మనం చేసే పని వల్ల ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగితే మనం చాలా బాధ పడాల్సివస్తుంది. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేసే ముందు ఒకటికి పది సార్లు అలోచించి చేయడం ద్వారా వాళ్ళను ఆనందంగా ఉంచగలుగుతాం.    

9, డిసెంబర్ 2020, బుధవారం

యోగి చెప్పిన నిజమైన సంతోషం

యోగి చెప్పిన నిజమైన సంతోషం



ఒక ఊరిలో ఒక ముసలివాడు ఉండేవాడు. అతను ఆ ఊరిలోని వ్యక్తులను నిజమైన సంతోషం అంటే ఏమిటి అని అడుగుతాడు. అలా అతను అడిగిన ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెబుతారు. అలా వాళ్ళు చెప్పిన సమాధానం ఆ ముసలివాడికి నచ్చకపోతే వాళ్ళని నిందించడం, దూషించడం చేసేవాడు. ఆ విధంగా ఊరిలోని ప్రజలందరిని ఎప్పుడు తిడుతూ వాళ్ళకి విసుగు తెప్పించేవాడు. ఆ విధంగా మెంటల్ మనిషిలాగా మారిన ఆ ముసలివాడిని ఊరిలో నుండి తరిమేయాలని ఆ ఊరి ప్రజలు నిర్ణయించుకుంటారు. కాని ముసలివాడు కదా బయటకి వెళ్లి ఎలా బ్రతుకుతాడు అని ఆ ఊరివారు అతనిని ఊరిలోనే ఉండనిస్తారు.


 


అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఒక సారి ఆ ముసలివాడు ఊరిలో ఉన్న చిన్న బండరాయిపై కూర్చుని ఉంటాడు. అలా అక్కడ కూర్చున్న ముసలి వాడి ముందు నుండి పక్క ఊరి వ్యక్తి వెళ్తాడు. వెంటనే ఆ ముసలివాడు ఆ ఊరి గుండా వెళ్తున్న ఆ వ్యక్తిని ఆపి అతనిని నిజమైన సంతోషం అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ముసలి వాడితో ఇలా అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కాని ఇక్కడకు కొన్ని మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది. అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు. అతని దగ్గరకు వెళితే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 

ఆ మాటలు విన్న ముసలివాడు అడవిలో ఉన్న ఆ యోగిని కలవడానికి వెళ్తాడు. అలా ఆ ముసలి వాడు ఆ యోగి దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అంటాడు. ఓ యోగిరాజా నేను నిజమైన సంతోషం అంటే ఏమిటో అని మా ఊరిలోని ప్రతి ఒక్కరిని అడిగాను. అయితే వాళ్లలో ఎవరూ కూడా నా ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పలేకపోయారు. అలా ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క ఎంతో నిరాశగా, కష్టంగా జీవితాన్ని గడుపుతున్నాను. కాబట్టి నువ్వైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అతనిని అడుగుతాడు. అప్పుడు ఆ యోగి ముసలివాడితో ఇలా అంటాడు. 

నిజమైన సంతోషం అనేది మన మనసులోనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని నిందిస్తూ, బాధ పడుతూ ఉంటే ఆ నిజమైన సంతోషాన్ని పొందలేము. మనం మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచుతూ, మన పనిని మనం చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా  నిజమైన సంతోషాన్ని పొందగలం. కాబట్టి ఇప్పటి నుండి ఎదుటివారిని నిందించడం మానేసి, నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉండు ఆ సంతోషం నీ వెంటే ఉంటుంది అని ఆ యోగి ముసలివాడితో చెబుతాడు. ఆ మాటలు విన్న ముసలివాడు ఎంతో బాధ పడి తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అప్పటి నుండి ఎవరిని నిందించకుండా తన పని తాను చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు. 

8, డిసెంబర్ 2020, మంగళవారం

ఏనుగు మరియు దాని తాడు కథ

ఏనుగు మరియు దాని తాడు కథ


నాగార్జున అనే వ్యక్తికి ప్రపంచాన్ని వీక్షించడం అంటే చాలా ఇష్టం. అలా అతను ఎన్నో దేశాలలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తాడు. ఈ క్రమంలో అతను ఒక సారి థాయిలాండ్ వెళ్తాడు. ఆ దేశంలోని ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్తున్న అతనికి ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది. అయితే ఆ ఏనుగు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంత లావుగా ఉంటుంది. అయితే అక్కడి కాపరి, అంత లావుగా ఉన్న ఏనుగుకు చిన్న తాడును కాలికి తగిలించి పక్కనే ఉన్న చెట్టుకు కట్టేస్తాడు. అలా ఎంతో లావుగా ఉన్న ఆ ఏనుగు చిన్న తాడును తెంపుకోకుండా అక్కడే ఉండిపోవడంతో అక్కడికి వచ్చిన నాగార్జునకు ఆశ్చర్యం వేస్తుంది.


అప్పుడు నాగార్జున అక్కడ ఉన్న కాపరిని అసలు ఆ ఏనుగు ఎందుకు ఆ తాడును తెంపుకుని వెళ్లడం లేదు అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ కాపరి నాగార్జునతో ఇలా అంటాడు. ఆ ఏనుగు చిన్న వయసులో ఉన్నప్పుడు మేము దానిని ఈ చిన్న తాడుతో కడతాం. అప్పుడు అది చిన్న పిల్ల కావడం వల్ల ఎంతగా ప్రయత్నించిన ఆ తాడును తెంపుకోలేకపోతుంది. అప్పటి నుండి ఆ ఏనుగు నేను ఈ తాడును తెంపుకోలేను అనే ధృడ నిశ్చయానికి వచ్చేస్తుంది. ఇంక అప్పటి నుండి ఆ ఏనుగు తన కాలికి ఉన్న తాడును వదిలించుకుని వెళ్ళడానికి ప్రయత్నించదని ఆ ఏనుగుల కాపరి నాగార్జునతో చెపుతాడు.

 

మనం కూడా ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టినప్పుడు మనం చిన్న వాళ్ళం కాబట్టి, ఆ పని మనకి కొత్త కాబట్టి ఒకొక్కసారి ఓడిపోవచ్చు. అలా మనం ఓడిపోయినప్పుడు మనల్ని మనం అసమర్ధులుగాను, చేతకాని వాళ్లగాను ఉహించుకుంటాం. ఇంక మనం ఈ ఓటమి అనే చెర నుండి బయటకి రాలేము అని అనుకుంటాం. కాని అది చాలా తప్పు, మనం ఎప్పుడైనా ఏదైనా పనిని  చేస్తూ ఓడిపోతే, ఇబ్బందులు కలిగితే వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి, అంతేగాని ఇంక నేను ఏమి చేయలేను అని అక్కడే ఆగిపోకూడదు.     

7, డిసెంబర్ 2020, సోమవారం

ప్రపంచంలోని అసలైన ధనవంతుడు.

ప్రపంచంలోని అసలైన ధనవంతుడు.




ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో పద్దెనిమిది సార్లు మొదటి స్థానంలో నిలిచిన  వ్యక్తి బిల్ గేట్స్. బిల్ గేట్స్ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సమయంలో అమెరికాలోని ఒక ప్రముఖ ఛానల్ అతనిని ఇంటర్వ్యూకి పిలుస్తుంది. అప్పుడు అక్కడి యాంకర్ బిల్ గేట్స్ ని ఈ ప్రపంచంలో మీకంటే ధనవంతుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు బిల్ గేట్స్ అవును ఈ ప్రపంచంలో నాకంటే ధనవంతుడు ఉన్నాడు అని అంటాడు. అలా అన్న బిల్ గేట్స్ తన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని గురించి ఆ యాంకర్ కు తెలియచేస్తాడు. నేను మైక్రోసాఫ్ట్ స్థాపించకముందు, ఏ విధమైన పేరు ప్రఖ్యాతలు పొందనప్పుడు న్యూ యార్క్ సిటీలో ఉన్న ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాను.

 


అక్కడ ఒక వ్యక్తి న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ నాకు కనిపించాడు. అతనిని చూసిన నాకు న్యూస్ పేపర్ చదవాలనిపించింది. అయితే నా దగ్గర ఆ పేపర్ కొనడం కోసం చిల్లర లేదు. అప్పుడు నేను అతని దగ్గరకు వెళ్లి నాకు పేపర్ ఇవ్వు నీకు డబ్బులు తర్వాత ఇస్తాను అని అన్నాను. దానికి అతను సరే అని నా చేతిలో పేపర్ పెట్టి వెళ్ళిపోయాడు.  అలా కొన్ని సంవత్సరాలకు అదే ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాను. అప్పుడు కూడా అతను అక్కడ న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ కనిపించాడు. అయితే ఆ సమయంలో కూడా నా దగ్గర పేపర్ కొనడానికి చిల్లర లేదు. అందువల్ల నేను అతని దగ్గరకు వెళ్ళలేదు. అలా అతని దగ్గరకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన నన్ను చూసి, ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి చేతిలో పేపర్ పెట్టి వెళ్ళిపోబోతాడు. 

అప్పుడు నేను ఆ పేపర్ ని వెనక్కి ఇచ్చేయాలని చూసినా అతను తీసుకోలేదు. అంతేకాకుండా అతను నాతో ఇలా అన్నాడు. నేను ఇప్పటి వరకు అమ్మిన పేపర్స్ ద్వారా నా సొమ్ము నాకు వచ్చేసింది. ఇది నాకు ప్రాఫిట్. నేను నా ప్రాఫిట్ నుండి కొంచెం భాగాన్ని నీకు ఇస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా 19 ఏళ్ళు గడిచిపోయింది. నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకడిగా మారాను. అలా ఒకసారి అనుకోకుండా అతను నాకు గుర్తుకు వచ్చాడు. నేను వెంటనే ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాను. అలా రెండు నెలల పాటు వెతికిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అడ్రస్ నాకు దొరికింది. ఆ తర్వాత నేను అతని దగ్గరకు వెళ్లి నేను నీకు గుర్తున్నానా అని అడిగాను. 

దానికి సమాధానంగా అతను నువ్వు బిల్ గేట్స్ అని అన్నాడు. నేను మళ్ళీ ఇంకొక సారి నేను ఎవరో సరిగ్గా చూసి చెప్పండి అని అడిగాను. దానికి సమాధానంగా అతను నేను నీకు ఎయిర్ పోర్ట్ లో రెండు సార్లు న్యూస్ పేపర్ ఇచ్చాను అని అన్నాడు. వెంటనే నేను నువ్వు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు ఉచితంగా న్యూస్ పేపర్ ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను నీకు ఏమి కావాలో అడుగు అని అన్నాను. అప్పుడు అతను నేను నీ దగ్గర డబ్బులు లేనప్పుడు పేపర్ ని ఇచ్చాను. కాని నువ్వు ఇప్పుడు ధనవంతుడివి. కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు చేసే సహాయం నేను నీకు చేసిన సహాయం సరి సమానం కాదు. 

అందువల్ల నువ్వు ఇచ్చే డబ్బు నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు. ఆ మాటలు విన్న నాకు నిజమైన ధనవంతుడు అతనే అని అనిపించింది. అలా బిల్ గేట్స్ తన జీవితంలో జరిగిన సంఘటనను ఆ యాంకర్ కు తెలియచేస్తాడు. బిల్ గేట్స్ చెప్పిన ఈ విషయం ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే మనం ఎవరికైనా సాయం చేయాలంటే గొప్ప ధనవంతులమే కానవసరం లేదు. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతోనే సాయం చేయొచ్చు అని తెలుసుకోవాలి.   

6, డిసెంబర్ 2020, ఆదివారం

అసలైన ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం.

అసలైన ఆనందం.



 ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఎంతో ఆప్యాయంగా కలసి మెలసి ఉండేవారు. అలా ఎంతో ప్రేమగా ఉండే ఆ ముగ్గురు తమ తమ పనులలో బిజీ అయిపోవడం వల్ల సక్రమంగా కలుసుకోలేక పోతారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఒక నిర్ణయానికి వస్తారు. సంవత్సరంలో ఒకసారి ఎంత పని ఉన్నా , ఎంత బిజీగా ఉన్నా ఒక చోట కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా ప్రతి ఏటా వాళ్ళు ముగ్గురు ఒక చోట కలుసుకునేవారు. ఆ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు వాళ్ళు ముగ్గురు ముసలి వాళ్ళవుతారు. ఎప్పుడూ లాగానే వాళ్ళు ముగ్గురు కలుసుకునే రోజు వస్తుంది.


 


అయితే వాళ్ళు ముగ్గురు ముసలి వాళ్ళు అవ్వడం వల్ల ఎంతో కష్టంగా, ఇబ్బంది పడుతూ ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అలా అక్కడికి వచ్చిన వాళ్ళు ముగ్గురు తమ తమ జీవితాలలో జరిగే విశేషాలను గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు ముగ్గురు అలా సంభాషించుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి ఇలా అంటాడు. మనం ముగ్గురం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ కలుసుకుంటామో లేదో అసలు బ్రతికి ఉంటామో లేదో అని అంటాడు. 

అప్పుడు అక్కడ ఉన్న రెండో వ్యక్తి ఇలా అంటాడు. నువ్వు మనం వచ్చే సంవత్సరం వరకు బ్రతికి ఉంటామో లేదో అని అంటున్నావు, అసలు మనం రేపటి రోజును చూస్తామో లేదో అని నేను అనుకుంటున్నాను అని అంటాడు. అలా వాళ్లిదరూ చెప్పిన విషయాలను గురించి విన్న మూడవ వ్యక్తి కొంతసేపు అలోచించి ఇలా అంటాడు. మీరిద్దరూ సంవత్సరాలు, రోజుల గురించి ఆలోచిస్తున్నారు. కాని నేను మనం మరు నిమిషం బ్రతికి ఉంటామో లేదో అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. 

అది విన్న మిగిలిన ఇద్దరు అవును అని అంటారు. ఈ కథ ముసలి వాళ్లకు  సంబంధించిన కథ మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన కథ. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టిన ఏ మనిషికి తెలియదు తను ఎప్పుడు చనిపోతానో అని. కాబట్టి రేపటి గురించి ఆలోచించడం మానేసి ఈ రోజును ఆనందంగా బ్రతకడం కోసం ప్రయత్నిద్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనల్ని ఎంతగానో ఇష్టపడే మన స్నేహితులను, కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచుదాం. అలా వాళ్ళని ఆనందంగా ఉంచుతూ మనం కూడా అనందంగా ఉంటూ మన జీవితాన్ని ముగిద్దాం.  

5, డిసెంబర్ 2020, శనివారం

నిజమైన దేశ రాజు.

నిజమైన దేశ రాజు



పూర్వం ఒక దేశంలో రాజు ఉండేవాడు. ఆ రాజు దేశంలోని ప్రజల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడు కష్టపడేవాడు. అలా ఎన్నో గొప్ప పనులు చేస్తున్న ఆ రాజు అక్కడి దేశపు ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంటాడు. కాని దురదృష్టం ఏమిటంటే ఆ రాజుకు ఎటువంటి సంతానం ఉండదు. దాని వల్ల తన తర్వాత దేశాన్ని పరిపాలించడానికి తన వారంటూ ఎవరు ఉండరు. అందువల్ల ఆ రాజు తన దేశాన్ని, దేశ ప్రజలను మంచిగా పరిపాలించే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో రాజు గారు తన తదనంతరం దేశాన్ని పరిపాలించడానికి ఒక సమర్ధుడైన రాజుకోసం వెతుకుతున్నాం, మీలో ఎవరికైనా రాజు అవ్వాలని ఆసక్తి ఉంటే దేశ రాజధానికి రండి అని పేపర్ లో ప్రకటన వేయిస్తాడు.

ఆ ప్రకటనను చూసిన ఎంతోమంది యువకులు, సమర్థులు, ధీరులు ఇలా చాలా మంది ఎంతో ఆసక్తిగా దేశ రాజధానికి బయలుదేరతారు. అదే దేశంలో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలోని చిన్న గ్రామంలో జీవిస్తుంటాడు. పుట్టుక నుండి పేదవాడైన ఆ యువకుడు ఒక రోజు తిని మరొక రోజు తినక ఎంతో కష్టమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అలా రాజుగారు పంపిన పేపర్ ప్రకటనను చూసిన ఆ యువకుడు దేశ రాజధానికి వెళ్లి రాజుగా అయ్యి తన దరిద్రాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటాడు. 

అందుకోసం ఆ యువకుడు రాత్రి పగలు కష్టపడి పని చేసి కొన్ని డబ్బులను సంపాదించి ఆ డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కుంటాడు. తన దగ్గర ఇంకా కొంచెం సొమ్ము ఉంటే దానిని తన దారి ఖర్చుల కోసం ఉంచుకుంటాడు. అలా ఆ యువకుడు ఎన్నో రోజుల పాటు ప్రయాణం చేసి ఆ దేశపు రాజధానికి చేరుకుంటాడు. దేశరాజధానికి చేరుకున్న ఆ యువకుడికి ఒక గుడి దగ్గర మెట్లపై అడుక్కుంటూ ఉన్న ముష్టి వాడు కనిపిస్తాడు. 

ఆ ముష్టివాడు చలికి వణుకుతూ అతని ఆకలిని తీర్చమని ఆ యువకుడిని 
వేడుకుంటాడు. అటువంటి దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్న ముష్టివాడిని చూసిన ఆ యువకుడు వెంటనే తను వేసుకున్న చొక్కాయిని తీసి అతనికి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా తను తినడానికి తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారాన్ని అతనికి ఇచ్చేస్తాడు. అలా తన బట్టలను, ఆహారాన్ని ఇచ్చిన యువకుడిని ఆ ముష్టివాడు ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే తను ఎంతో కష్టపడి కొనుక్కున్న బట్టలను అతనికి ఇచ్చేయడం వల్ల రాజుగారి సభకు వెళ్ళడానికి సంకోచిస్తాడు.

 

కాని ఇంత దూరం వచ్చి ఎందుకు వెనక్కి వెళ్లడం అని ఆ యువకుడు తన దగ్గర ఉన్న పాత బట్టలను వేసుకుని ఆ సభకు వెళ్తాడు. అలా కొంతసేపటికి రాజుగారు ఆ సభకు హాజరవుతారు. ఆ సభకు వచ్చిన రాజుగారు ఆ యువకుడిని చూసుకుంటూ వెళ్లి సింహాసనాన్ని అధిష్టిస్తాడు. రాజుగారిని చూసిన ఆ యువకునికి ముష్టివాడు, రాజుగారు ఒకే విధంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వెంటనే ఆ యువకుడు రాజుగారిని ఇలా అడుగుతాడు. రాజా నేను మీలాంటి వారినే ఒక వ్యక్తిని గుడిమెట్ల దగ్గర చూసాను అని అంటాడు. 

దానికి సమాధానంగా రాజుగారు అక్కడ ఉన్నది నేనే అని సమాధానమిస్తాడు. అది విన్న ఆ యువకుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ రాజు గారు అసలు అతను అక్కడ ఉండడానికి గల కారణాన్ని యువకుడికి తెలియ చేస్తాడు. నేను ఆ మెట్లపై ముష్టివాడిలా అడుక్కుంటూ మీ యొక్క బుద్ధిని పరీక్షించాను. అంతేకాకుండా నేను ఇక్కడికి వచ్చిన వారందరిని ముందుగానే గుడి దగ్గర చూసాను. నేను ప్రతి ఒక్కరిని నాకు బట్టలు ఇమ్మని, ఆహారం పెట్టమని అడిగాను. కొంత మంది నన్ను తిట్టారు. మరియు కొంత మందిని నేను నాకు చలి వేస్తోంది బట్టలు ఇవ్వండి అని అడిగితే  అడుక్కునేవాడివి నీకెందుకు బట్టలు అని ఛీకొట్టారు. 

కాని నువ్వు మాత్రం నన్ను చూసిన వెంటనే నా బాధను అర్ధం చేసుకుని నీ దగ్గర ఉన్న కొత్త బట్టలను, నువ్వు దాచుకున్న కొద్దిపాటి ఆహారాన్ని నాకు ఇచ్చేసావు. అలా నీలో ఉన్న పెద్ద మనస్సును చాటుకున్నావు. అందువల్ల నిన్నే ఈ దేశానికి రాజుగా నియమిస్తున్నాను అని అంటాడు. అలా దరిద్రంలో బ్రతికే ఆ యువకుడు తనలోని మంచితనం వల్ల ఆ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. 

4, డిసెంబర్ 2020, శుక్రవారం

తన వెంటే ఉంటూ తననే భయపెట్టే తన నీడ.


 తన వెంటే ఉంటూ తననే భయపెట్టే తన నీడ.



ఒక వ్యక్తి తన యొక్క శరీర నీడను మరియు అతని కాళ్ల యొక్క నీడను చూసి విసుగు చెందుతూ ఉండేవాడు. అలా తనను ఇబ్బంది పెడుతున్న శరీరం యొక్క నీడను కాళ్ళ యొక్క నీడను జయించాలనుకుంటాడు. అనుకున్నదే పనిగా పరిగెట్టడం మొదలు పెడతాడు. ఎంతో దూరం పరిగెడతాడు. అయినా గాని తన నీడని జయించలేక పోతాడు.

 

అప్పుడు అతనికి ఇలా అనిపిస్తుంది. నేను సక్రమంగా పరిగెట్టక పోవడం వల్లనే నేను ఓడిపోతున్నాను అని అనుకుంటాడు. అలా అనుకున్న అతను తనలోని శక్తిని మరింతగా పెంచుకుని ఇంకా వేగంగా, మరెంతో వేగంగా పరిగెడతాడు. అయినా గాని తన యొక్క నీడని జయించలేకపోతాడు. 

అలా ఎన్నో సంవత్సరాల పాటు ప్రయత్నించి ప్రయత్నించి ఇక శక్తి లేక మరణిస్తాడు.  జీవితం కూడా ఇంతే. మనం మన జీవితంలో వచ్చే కష్టాలను చూసి పరిగెడుతున్నంత కాలం మనం వాటిని జయించలేం. కాని ఎప్పుడు అయితే మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మన సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతామో అప్పుడు వాటిని మనం ఖచ్చితంగా జయించి తీరుతామ్. 

3, డిసెంబర్ 2020, గురువారం

నిజమైన సత్యం కోసం వెతకడం.

నిజమైన సత్యం కోసం వెతకడం.



ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊరిలోని వారితో మంచిగా ఉంటూ  అందరికి సహాయం చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి అయిన అతన్ని ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా గౌరవించేవారు. అయితే అతని కొడుకు మాత్రం అతని మాటను ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. తను ఏది చెప్తే దానికి వ్యతిరేఖంగానే పనులు చేసేవాడు. ఆ పిల్లవాడు తన స్నేహితులతో కలిసి బలాదూర్ తిరుగుతూ, సమయాన్ని వృధా చేస్తూ కాలాన్ని గడిపేవాడు. ఆ విధంగా జులాయిగా తయారైన కొడుకును చూసిన ఆ వ్యక్తి ఎప్పుడు బాధపడుతుండేవాడు. అలా కాలం గడుస్తూ ఉండగా కొన్ని రోజులకు ఆ వ్యక్తి ముసలి వాడవుతాడు. అందువలన అతనికి ఇంటిని పోషించడం కష్టమవుతుంది. ఇంటి బాధ్యతను ఎలా అయిన తన కొడుకుకి అప్పగించాలి అని అనుకుంటాడు. 

అందుకోసం ఆ వ్యక్తి రాత్రంతా అలోచించి ఒక ఉపాయాన్ని కనుగొంటాడు. ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి తన కొడుకుతో ఇలా అంటాడు. నీకు నేను ఒక రహస్య నిధి స్థావరం యొక్క మ్యాప్ ను ఇస్తున్నాను. నువ్వు ఎలా అయిన ఆ నిధి ఉన్న స్థావరాన్ని చేరుకుని అక్కడ ఉన్న నిధి నిక్షేపాలను తీసుకుని రా అని అంటాడు. అది విన్న ఆ కుర్రాడికి ఈ ఛాలెంజ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. తర్వాత రోజు వాళ్ళ తండ్రి చెప్పినట్టు నిధి నిక్షేపాల కోసం ప్రయాణమవుతాడు. అలా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆ కుర్రవాడు ఎన్నో కొండలు, అడవులు, బోర్డర్స్ దాటుకుంటూ ముందుకు సాగుతాడు. రోజులు, వారాలు, నెలలు గడుస్తుంటాయ్ ఎలా అయిన నిధిని సంపాదించాలని ఆ కుర్రాడు కసితో ముందుకు సాగుతూనే ఉంటాడు. ఈ క్రమంలో ఆ కుర్రవాడు ఎంతో మందిని కలుస్తాడు. కొంతమంది ఆహారం ఇచ్చి ఆ కుర్రాడి ఆకలి తీరుస్తారు. 

మరి కొంత మంది తనకు పడుకోవడానికి ఆశ్రయం కల్పిస్తారు. అంతేకాకుండా ఆ కుర్రాడు తన ప్రయాణంలో ఎంతో మంది దొంగల యొక్క దోపిడీని, మనుషులు చేసే మోసాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. కొన్ని సార్లు వాతావరణంలో కలిగిన మార్పుల వల్ల తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఆ తర్వాత మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టేవాడు. అలా సంవత్సరం పాటు సుదీర్ఘ ప్రయాణాన్ని చేసిన తర్వాత ఎలా అయితే ఆ కుర్రాడు తన తండ్రి చెప్పిన నిధి నిక్షేపాల ప్రదేశాన్ని చేరుకుంటాడు. ఎంతోదూరం ప్రయాణం చేసి తను చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకున్న ఆ కుర్రవాడు ఆతృతగా ఆ నిధి ఉన్న ప్రదేశంలో తవ్వడం మొదలుపెడతాడు. అలా నిధినిక్షేపాల కోసం తవ్వడం మొదలు పెట్టి పది అడుగులు తవ్వుతాడు, నిధి దొరకదు, మరో పది అడుగులు తవ్వుతాడు అయినా నిధి దొరకదు, అయినా నిరాశ చెందకుండా మరో పది అడుగులు తవ్వుతాడు అయినా గాని నిధి నిక్షేపాలు దొరకవు. 

ఎంతోదూరం ప్రయాణం చేసి ఆ నిధులున్న ప్రదేశానికి చేరి నిధుల కోసం తవ్వి, నిధులు దొరకక నిరాశ చెందిన ఆ కుర్రాడు చివరకు అక్కడ నిధులు లేవని తెలుసుకుంటాడు. అలా తన తండ్రి అక్కడ నిధులున్నాయని అబద్ధం చెప్పాడని అనుకుని ఆ కుర్రవాడు బాధ పడుతూ, ఇక చేసేదేమి లేక అక్కడి నుండి తన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. అలా తన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ కుర్రాడు మార్గమధ్యంలో ఉన్న చెట్లను, ప్రకృతుని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాడు. మరియు చెట్లపై వాలిన పక్షుల యొక్క కిలకిలలు, కేరింతలు ఆ కుర్రవాడి యొక్క మనసును ఎంతగానో ఆనందింపచేస్తాయి. అంతేకాకుండా ఆ కుర్రాడు తనకు ఆకలి వేసినప్పుడు వేటాడి తన ఆకలిని తీర్చుకుంటాడు. మార్గమధ్యంలో పడుకోవడానికి కావల్సిన ఏర్పాట్లను తనంతట తానుగా చేసుకుంటాడు.  

సమయానుకూలంగా ఆ కుర్రాడు తన తిరుగు ప్రయాణాన్ని చేస్తూ ముందుకు సాగుతాడు. మరియు క్రూర మృగాల బారి నుండి తనని తాను రక్షించుకుంటాడు. అంతేకాకుండా ఆ కుర్రాడు నిధి నిక్షేపాల కోసం బయలుదేరిన సమయంలో మార్గ మధ్యంలో ఉన్నప్పుడు తన ఆకలిని తీర్చిన వారిని మళ్ళీ కలుసుకుని వారికి కృతజ్ఞతలు తెలుపుతాడు. అలా రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రయాణాన్ని చేసిన ఆ కుర్రవాడు చివరికి తన ఇంటికి చేరుకుంటాడు. ఆ విధంగా ఎంతోమందిని కలిసి, ఎన్నో సత్యాలను తెలుసుకుని ఇంటికి చేరుకున్న తన కొడుకుని చూసిన ఆ తండ్రి ఆనందంతో తనని గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుతో ఇలా అంటాడు. నువ్వు నేను చెప్పిన నిధి నిక్షేపాలను కనిపెట్టవా అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ కుర్రవాడు నేను ఆ నిధి నిక్షేపాలను కనిపెట్టలేకపోయాను నన్ను క్షమించండి అని అతని తండ్రిని వేడుకుంటాడు. 

దానికి బదులుగా ఆ కుర్రవాడి తండ్రి అసలు అక్కడ ఎటువంటి నిధి నిక్షేపాలు లేవు అని చెబుతాడు. అది విన్న ఆ కుర్రాడు తన తండ్రిని ఇలా అడుగుతాడు. అసలు అక్కడ ఎటువంటి నిధి నిక్షేపాలు లేకపోతే నన్ను ఎందుకు అక్కడికి పంపించారు అని అడుగుతాడు. నేను అక్కడ ఎటువంటి నిధినిక్షేపాలు లేకపోయిన నిన్ను ఎందుకు పంపానో తర్వాత చెప్తాను, ముందు నువ్వు నీ ప్రయాణం ఎలా జరిగిందో చెప్పు అని తండ్రి కొడుకును అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రవాడు తన తండ్రితో ఇలా అంటాడు. నేను మొదటగా నిధినిక్షేపాలను గురించి  ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాకు ఆ నిధిని ఎవరైనా దొంగిలిస్తారేమో అన్న భయం, అనుమానం కలిగాయి. అందువలన నిధి దగ్గరకు వెళ్ళినప్పుడు నేను ప్రపంచాన్ని సరిగ్గా చూడలేకపోయాను. కాని నేను అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి నిధి నిక్షేపాల భయం లేదు. 

అలా ఆనందంగా బయలుదేరిన నేను ఎంతోమందిని కలిశాను. మరెంతో మందిని నా స్నేహితులుగా మార్చుకున్నాను. ప్రకృతిని ఆస్వాదించాను. నేను ప్రతి రోజు గొప్ప గొప్ప అద్భుతాలను చూసాను. నన్ను నేను రక్షించుకోవడం కోసం ఎన్నో మార్గాలను వెతుకున్నాను. మరియు నేను ఎన్నో జీవిత సత్యాలను నేర్చుకున్నాను. ఈ విధంగా నేను నిధి నిక్షేపాలను పొందలేకపోయానన్న బాధ నుండి బయటకు రావడానికి నా తిరుగు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడింది. ఆ మాటలు విన్న కుర్రాడి తండ్రి, కుర్రాడితో ఇలా అంటాడు. నువ్వు ఒక లక్ష్యంతో జీవితాన్ని గడపాలని నేను కోరుకున్నాను. కాని నువ్వు ఎటువంటి లక్ష్యం లేకుండా ఖాళీగా ఉండేవాడివి. నువ్వు ఎటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని గడపడం వల్ల ఎంతో గొప్ప విలువైన సమయాన్ని వృధా చేసుకున్నావు. 

అలా నువ్వు నీ జీవితాన్ని వ్యర్ధపరుచుకోకూడదని నేను నిన్ను ఈ నిధి నిక్షేపాలను వెతకడానికి పంపాను అని ఆ వ్యక్తి తన కొడుకుతో చెప్తాడు. ఆ మాటలు విన్న కుర్రాడు ఎంతో బాధపడుతూ, కన్నీళ్లు పెట్టుకుని తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అప్పటి నుండి ఆ ఇంటి బాధ్యతలను స్వీకరించి అందరిని ఆనందంగా ఉంచుతూ తాను కూడా ఆనందంగా ఉంటూ ఒక మంచి జీవితాన్ని గడుపుతాడు. 

2, డిసెంబర్ 2020, బుధవారం

ప్రతి ఒక్కరూ ఆ దేవుని ప్రతిరూపాలే.

ప్రతి ఒక్కరూ ఆ దేవుని ప్రతిరూపాలే. 



పూర్వం ఒక నది సమీపాన చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలోని ప్రజలు అందరూ సంతోషంగా జీవిస్తూ, నిత్యం దైవారాధనలు చేస్తూ ఉండేవారు. అలా సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతున్న ఆ ఊరికి అకస్మాత్తుగా వరదలు వస్తాయి. ఆ వరదలు కొంచెం కొంచెంగా పెరగడం వల్ల వరద నీరు ఊరిలోని ప్రతి ప్రదేశానికి చేరుకుంటుంది. అప్పుడు ఆ ఊరిలోని ప్రజలు వరద ఉధృతి పెరగకుండా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతారు. అలా ఒకరి తర్వాత ఒకరు ఆ ఊరి నుండి బయటకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఒక వ్యక్తి హడావిడిగా పరిగెత్తుకుంటూ అక్కడే ఉన్న గుడిలోకి వెళ్తాడు. 

అతను అలా పరిగెత్తుకుంటూ గుడిలోనే నివాసముండే పరమ భక్తుని దగ్గరకు వెళ్లి తనతో ఇలా అంటాడు. వరదల వల్ల ప్రతి ఒక్కరూ ఊరి నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు, మీరు కూడా రండి మిమ్మల్ని కూడా మాతో పాటు సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్తాము అని అంటాడు. దానికి బదులుగా ఆ భక్తుడు అక్కడికి వచ్చిన వ్యక్తితో ఇలా అంటాడు. నేను పరమ భక్తుడిని, నన్ను దేవుడు వచ్చి ఖచ్చితంగా కాపాడతాడు. కాబట్టి మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోయి మీ ప్రాణాలను రక్షించుకోండి అని అంటాడు. ఆ మాటలు విన్న వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత అక్కడే ఉన్న భక్తుడు దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని దేవుడిని ప్రార్థిస్తాడు.


 

అలా కొంత సమయం గడిచిన తర్వాత ఒక వ్యక్తి పడవను నడుపుకుని అక్కడికి వస్తాడు. అతను కూడా ఆ భక్తుడిని తనతో పాటు వచ్చి తన ప్రాణాలను కాపాడుకోమని చెబుతాడు. అది విన్న ఆ భక్తుడు మీరు నన్ను ఏమి కాపాడాల్సిన అవసరం లేదు. నన్ను ఆ దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు అని అతన్ని కూడా అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. అలా వాళ్లిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత వరద ప్రవాహం మరింతగా పెరుగుతుంది. అప్పుడు ఆ భక్తుడు గుడి పైకి వెళ్తాడు. అలా గుడిపైకి వెళ్లిన ఆ భక్తుడు దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని దేవుడిని ఆవేదనతో వేడుకుంటాడు. 

ఈ ప్రక్రియ ఇలా జరుగుతూ ఉండగా కొంత సేపటికి ఓ హెలికాఫ్టర్ అక్కడికి వస్తుంది. ఆ హెలికాఫ్టర్ లో వచ్చిన వ్యక్తి పై నుండి కిందకి నిచ్చెనను వేస్తాడు. అలా నిచ్చెనను కిందకు వేసిన ఆ వ్యక్తి అక్కడ ఉన్న భక్తుడిని దాని సాయంతో హెలికాఫ్టర్ లోనికి రమ్మంటాడు. ఆ మాటలు విన్న భక్తుడు నేను రాను నన్ను దేవుడు కాపాడతాడు అని చెప్పి వాళ్ళను కూడా అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. వెంటనే ఆ హెలికాఫ్టర్ వాడు వేరే వారిని కాపాడడానికి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి, పడవ వేసుకొచ్చిన వ్యక్తి, హెలికాఫ్టర్ లో వచ్చిన వ్యక్తి  వెళ్లిపోయిన తర్వాత వరద ప్రవాహం మరింతగా పెరిగి అక్కడ ఉన్న భక్తుడు ఆ వరద నీటిలో మునిగి చనిపోతాడు. చనిపోయిన ఆ భక్తుడు తను ఎంతగానో ప్రార్ధించే దేవుని దగ్గరకు వెళ్లి అతనిని ఇలా అడుగుతాడు. ఏంటి దేవుడా నేను నీ మీద ఎంతో ప్రేమను, నమ్మకాన్ని పెంచుకుంటే నువ్వు మాత్రం నేను చనిపోయేలా చేసావు అని దేవుడిని నిందించడం మొదలు పెడతాడు. దానికి బదులుగా దేవుడు ఇలా అంటాడు. 

ప్రతి ఒక్కరు దేవుని ప్రతి రూపాలే అని నీకు తెలియదా. నేను నిన్ను కాపాడడం కోసం నీ ముందుకు మూడు వేరు వేరు రూపాలలో వచ్చాను కాని నువ్వు నన్ను గుర్తించకుండా మూర్ఖంగా ప్రవర్తించి అక్కడే  ఉండిపోయావు.  ఇప్పుడు మాత్రం నిన్ను కాపాడలేదని నన్ను నిందిస్తున్నావు అని దేవుడు అతనికి జీవితం యొక్క అసలైన సత్యాన్ని తెలియచేస్తాడు. అది విన్న ఆ భక్తుడు తను చేసిన పనికి ఎంతగానో పశ్చాత్తాప పడతాడు. అలా ఆ భక్తుడు పడే బాధను తెలుసుకున్న ఆ దేవుడు అతనికి పునర్జన్మను ప్రసాదిస్తాడు. ఈ విధంగానే మనం కూడా కొన్ని సార్లు మూర్ఖంగా ప్రవర్తించి మన ఎదురుగా ఉన్న అవకాశాలను మనంతట మనమే వదిలేసుకుంటాం. కాబట్టి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వాటిని అందిపుచ్చుకుని గొప్ప స్థానానికి చేరుకుందాం.   

1, డిసెంబర్ 2020, మంగళవారం

ఏ వయసువారికైనా ప్రయత్నిస్తే విజయం తప్పక దక్కుతుంది.

ఏ వయసువారికైనా ప్రయత్నిస్తేనే విజయం


పూర్వం ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ఒక మార్గంలో పెద్ద బండ రాయిని తన సైనికులతో పెట్టిస్తాడు. అయితే రాజు గారు ఎందుకు ఆ రాయిని మార్గ మధ్యంలో పెట్టామన్నారు అని ఆ సైనికులకు కూడా తెలియదు. రాజుగారు పెట్టామన్నారు అని ఆ సైనికులు అక్కడ ఆ రాయిని పెడతారు. అలా మార్గమధ్యంలో సైనికులు పెట్టిన రాయి పక్కనుండి ప్రతి ఒక్కరు వెళ్తారు, వస్తారు. కాని ఎవరు కూడా ఆ రాయిని పక్కకు తీయాలని అనుకోరు. ఎవరి పని మీద వాళ్ళు ఆ మార్గంలో వస్తారు మళ్ళీ తమ పని చూసుకుని అదే మార్గంలో వెళ్తారు. కొంతమందైతే మార్గంలో ఉన్న రాయిని తీయించట్లేదు అని రాజు గారిని తిడతారు. అలా ఎంతో మంది ఆ మార్గంలో ఉన్న రాయి పక్కనుండి వస్తూ పోతూ ఉంటారు.



ఇలా జరుగుతున్న క్రమంలో ఒక కూరగాయలు అమ్ముకునే ముసలి వాడు అదే మార్గంలో తను రోజు అమ్ముకునే కూరగాయలను సంచుల నిండా నింపుకుని ఆ రాయి దగ్గరకు వస్తాడు. అలా మార్గ మధ్యంలో ఉన్న రాయిని చూసిన ముసలి వాడు అందరిలాగా ఆ రాయి పక్కనుండి వెళ్లడం మానేసి అందరికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం పక్కనే ఉన్న కర్రల సాయంతో ఆ రాయిని పక్కకి జరపడానికి ప్రయత్నిస్తాడు. ఆ ముసలి వాడు తన బలం మొత్తం ఉపయోగించి ఎంతోసేపు కష్టపడి చివరికి ఎలా అయితే ఆ రాయిని మార్గమధ్యం నుండి పక్కకి నెట్టేస్తాడు. అలా ఆ రాయిని పక్కకు నెట్టేసిన ముసలి వాడికి ఒక సంచి కనిపిస్తుంది. ఆ సంచిని చూసిన  ముసలి వాడు అది ఏంటా అని ఆతృతగా చూస్తాడు. అలా ఆ సంచిని తెరిచి చూసిన ముసలి వాడికి కొన్ని బంగారు నాణాలు, మరియు ఒక ఉత్తరం కనిపిస్తుంది.

 

ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది. నేను మన రాజ్యపు రాజును, ఈ సంచిని రాయి కింద పెట్టింది నేనే. ఎవరైతే ఈ రాయిని పక్కకు తొలగిస్తారో వారికి ఈ బంగారు నాణాలు సొంతం, అని రాసి ఉంటుంది. అలా రాసి ఉన్న ఉత్తరాన్ని చదివిన ముసలి వాడు ఆ బంగారు నాణాలను తన జేబులో వేసుకుని, సంతోషంతో తన వెంట తీసుకొచ్చిన కూరగాయలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మన జీవిత ప్రయాణంలో మనకు వచ్చే కష్టాలను, ఇబ్బందులను, చూసి కన్నీరు పెట్టుకోవడం, నిందించడం మానేసి వాటిని మనం మన జీవితం యొక్క ఎదుగుదలకు మెట్లుగా ఉపయోగించుకుని విజయం సాధించాలి. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...