west godavari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
west godavari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2021, శుక్రవారం

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి


పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయితే అతనికి వృధాప్యం రావడం వల్ల అతను వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతాడు. పరమభక్తుడైన ద్వారకుడి ఇబ్బందిని గ్రహించిన వేంకటేశ్వరుడు అతను నివాసం ఉంటున్న ప్రదేశంలో విగ్రహ రూపంలో వెలుస్తారు. అలా వేంకటేశ్వర స్వామి వారు ద్వారకుడి వలన ఇక్కడ వెలిశారని ఆయన గుర్తుగా ఈ ప్రదేశాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. పెద్ద తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న వారు చిన్న తిరుపతిలో ఆ మొక్కును చెల్లిస్తే వారికి పెద్ద తిరుపతిలో మొక్కు చెల్లించిన ఫలితం లభిస్తుంది అని అంటారు. కాని చిన్న తిరుపతిలో  మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని అక్కడి జనం అంటుంటారు.


ఈ వేంకటేశ్వరుని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మండలం మరియు గ్రామం అయిన ద్వారకా తిరుమలలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలోను, భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరంలో కొలువై వుంది. ప్రస్తుతం ఉన్న గుడి,  మండపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు గారు కట్టించారు. బంగారు ఆభరణాలు,వెండి వాహనాలను రాణి చిన్నమ్మ రావు స్వామి వారికి సమర్పించారు. ఈ గ్రామం పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరిణి, కుమార తీర్థమని  అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవంను కన్నుల పండుగగా జరుపుతారు. 

వేంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో ఆశ్రమంలో ఉండవలసి వస్తుంది. ఆ సమయంలో వేంకటేశ్వర స్వామికి ఆకలి వేస్తే అప్పుడు అక్కడికి వచ్చిన ఆవు యొక్క పాలను త్రాగుతాడు. అది చుసిన ఆ ఆవు యొక్క యజమాని కోపంతో వేంకటేశ్వరుని తలపై కర్రతో గట్టిగా కొడతాడు. అప్పుడు వేంకటేశ్వరుని తలపై చిన్న గాయం అవ్వడమే కాకుండా జుట్టు కూడా కొంచెం ఊడిపోతుంది. అయితే కలియుగ దైవం  అయిన వేంకటేశ్వర స్వామిని జుట్టు లేకుండా చుసిన గాంధర్వ కన్యా రాకుమారి అయిన నీలాదేవి తన కొప్పులో నుండి కొన్ని వెంట్రుకలను తీసి స్వామి వారి తలపై అలంకరిస్తుంది. అప్పటి నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు నీలాదేవిని గౌరవిస్తూ తమ నీలాలను స్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టలో సమర్పిస్తారు. 

ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండ పైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం మరియు వేంకటేశ్వరుని మందిరానికి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న కుంకుళ్ళమ్మ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ పుణ్యస్థలానికి వచ్చిన వారు ఈ మందిరాలను కూడా దర్శించుకుని వెళ్తారు. అంతే కాకుండా కొండ పైన ఉన్న గోశాలలోని గోవులు, మరియు గజరాజులు మనకు కనుల విందు కలిగిస్తాయి. 

స్వామి వారి దేవస్థానము ఆధ్వర్యంలో ఉన్న పద్మావతి వసతి గృహం, ఆండాళ్ అతిధి గృహం, సీత నిలయం, టీటీడీ అతిధి గృహాలు మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మీరు  ఏ సమయంలో వచ్చిన ఇక్కడ బస చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజు నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే దీనికోసం  భక్తులు ముందుగానే టిక్కెట్ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్వామి వారి లడ్డు ప్రసాదం కోసం కూడా ముందుగానే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తులు ఈ లడ్డు కోసం డబ్బు చెల్లించవలసి ఉంటుంది.  

విజయవాడ నుండి ద్వారకా తిరుమలకు 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 72 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం నుండి 47 కిలోమీటర్లు, భీమడోలు నుండి 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...